పత్రాలు తగలెట్టేసి తప్పించుకుందామనే.. బెడిసి కొట్టిన సీఐడీ చీఫ్ బిగ్ ప్లాన్!
posted on Apr 9, 2024 7:09AM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ తాడేపల్లి సిట్ కార్యాలయం వద్ద సీఐడీ సిబ్బంది కీలక పత్రాలను దగ్దం చేయడం సంచలనంగా మారింది. సిట్ కార్యాలయం కాంపౌండ్ లో పెద్ద మొత్తంలో పత్రాలను దగ్దం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీఐడీ చీఫ్ రఘురామ్‌రెడ్డి ఆదేశాల మేరకు వాటిని దగ్దం చేసినట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. సిబ్బంది దగ్దం చేసిన కాగితాల్లో హెరిటేజ్ సంస్థకు చెందిన కీలక పత్రాలు. చంద్రబాబుపై నమోదు చేసిన స్కిల్ కేసుకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఈ పత్రాలను దగ్దం చేసే సమయంలో ఫొటోలు, వీడియోలు తీసిన కొందరిని వాటిని తమకు ఇవ్వాలని సీఐడీ అధికారులు ఒత్తిడి తేవడం పత్రాల దగ్దం వెనుక పెద్ద మతలబే ఉందన్నఅనుమానాలకు తావిచ్చింది. గతంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై సీఐడీ అధికారులు పలు అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో చంద్రబాబుకు వ్యతిరేకంగా వాంగ్మూలం కోసం సీఐడీ అధికారులు అనేక మందిపై ఒత్తిడి తెచ్చారన్న విమర్శలూ ఉన్నాయి. అంతేకాదు.. హెరిటేజ్ ఫుడ్స్‌కు సంబంధించిన ఐటీ రిటర్న్స్ చట్టవిరుద్ధంగా అధికారులు పొందారని అప్పట్లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే సిట్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పత్రాల దగ్ధంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తాడేపల్లి సీఐడీ కార్యాలయంలో కీలక పాత్రాలను దగ్ధం చేసిన సంగతి వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు ఆఘమేఘాల మీద స్పందించారు. తాము దగ్ధం చేసిన పత్రాలు వేస్ట్ పేపర్లు అంటూ.. నమ్మించేందుకు ప్రయత్నించారు. తాము ఐదు కేసుల్లో చార్జిషీటు వేశామని, ఒక్కో చార్జిషీట్‌లో ఎనిమిది వేల నుంచి పదివేల పేజీల డాక్యుమెంట్లు ఉన్నాయని, చాలా జిరాక్సులు తీయాల్సి వచ్చిందని తెలిపారు.. అయితే, జిరాక్సులు తీసే సమయంలో మిషన్ వేడెక్కడం వల్ల పేపర్ స్టక్ అవుతుందని, ఇంక్ లెవల్ కూడా తగ్గిపోతుందని, దీనివలన కొన్ని కాపీలు సరిగ్గా రావని.. వీటన్నింటిని కూడా వేస్టు పేపర్లుగా గుర్తించి దగ్ధం చేస్తామని తెలిపారు. తాజాగా సిట్ కార్యాలయం సిబ్బంది దగ్దం చేసిన కాగితాలు కూడా అవేనంటూ అధికారులు చెప్పుకొచ్చారు. అధికారుల వివరణ తాటి చెట్టు ఎందుకు ఎక్కావంటే దూడగడ్డి కోసం అన్నట్లుందని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. అసలు సమస్యను పక్కదారి పట్టించేందుకు సీఐడీ ఉన్నతాధికారులు కట్టుకథలు చెబుతున్నరని విమర్శిస్తున్నారు. ఎందుకంటే.. సీఐడీ అధికారులు జిరాక్సులు తీసింది కేవలం హెరిటేజ్ సంస్థకు చెందిన కాగితాలేనా? హెరిటేజ్ సంస్థకు చెందిన పత్రాలను జిరాక్స్ తీసేటప్పుడే మిషన్లో ఇంక్ అయిపోయిందా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదే విషయాన్నితెలుగుదేశం నేతలు కూడా గట్టిగా ప్రశ్నిస్తున్నారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే సేకరించిన ఆధారాలు తప్పుడవని తేలి ఎక్కడ జైలుకెళ్లాల్సి వస్తుందోనన్న భయంతోనే సీఐడీ తాధికారులు కీలక పత్రాలను ద్వంసం చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది.
సీఐడీ అధికారులు చంద్రబాబుపై పెట్టిన కేసుల్లో కీలక పత్రాలను కూడా దగ్దం చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. పత్రాల దగ్ధంపై లోతైన విచారణకు డిమాండ్ చేశారు. ఏపీలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి భారీ మెజార్టీతో అధికారంలోకి వస్తుందని ప్రిడిక్ట్ చేస్తున్నాయి. దీంతో జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుంది. ఏపీలో వైసీపీ ఐదేళ్ల పాలనలో కొందరు పోలీసులు, అధికారులు వైసీపీ నేతలకు తొత్తులుగా పనిచేశారు. వైసీపీ నేతల ఆదేశాల మేరకు పలువురిపై అక్రమంగా కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేసిన ఘటనలు ఉన్నాయి.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ పరాజయం పాలై కూటమి అధికారంలోకి వస్తుందన్న అంచనాలతో వైసీపీకి తొత్తులుగా పని చేసిన అధికారులు కొత్త ప్రభుత్వం వస్తే తమకు జైలు తప్పదన్న వణుకు మొదలైంది. ముఖ్యంగా జగన్ ప్రాపకం కోసం అడ్డగోలుగా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు, వేధింపులకు పాల్పడిన సిట్ అధికారులు ఇక సర్దుకునే పనిలో పడ్డారు. గత ఐదేళ్లుగా తప్పుడు కేసులు.. తప్పుడు వాంగ్మూలాలు, ట్యాపింగ్‌లు ఇలా ఒక్కటేమిటి.. లెక్క లేనన్ని అక్రమాలతో నిలువెల్లా బురద పూసుకున్న సిట్ ఇప్పుడు ఆ బురదను కడిగేసుకుని చేతులు దులిపేసుకోవడానికి నుడీ అయిపోయింది. అందులో భాగంగానే సిట్ ఆఫీసులో ఉన్న పత్రాలను ముఖ్యంగా తెలుగుదేశం నేతలపై ఉన్న కేసులకు సంబంధించి అక్రమంగా సంపాదించిన పత్రాలన్నింటికీ నిప్పు పెట్టేశారు. ఇది ఎలా బయటపడిందంటారా.. ఆ కార్యాలయంలోని వ్యక్తులే దీనికి సంబంధించి వీడియో తీసి మీడియాకు పంపారు. మీడియాలో ఈ అంశం సంచలనంగా మారింది. చిత్తు కాగితాల్ని తగల బెట్టామని వారు కవర్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నం నవ్వుల పాలైంది. అవి హెరిటేజ్ కు సంబంధించిన పత్రాలని తగలబడకుండా మిగిలిపోయిన పత్రాలు నిర్ద్వంద్వంగా తేల్చేశాయి. తెలుగుదేశం నేతలు సైతం సిట్ తప్పులు తగలెట్టేస్తే కనిపించకుండా పోయేవి కావని అంటున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత తప్పక అనుభవించాల్సిందేనని హెచ్చరిస్తున్నారు.
అసలు ఈ ఐదేళ్ల కాలంలో సీఐడీ అధికారులు తాము బాధ్యత కలిగిన అధికారులమన్న విషయాన్ని పూర్తిగా విస్మరించి జగన్ ఏది చెబితే అది చేయడమే తమ ఉద్యోగ ధర్మం అన్నట్లుగా ఆయన సేవలో తరించిపోయారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నే చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలు పంపించడం, లోకేశ్ ను విచారించడం, తెలుగుదేశం ముఖ్యనేతలపై అక్రమ కేసులు బనాయించడం వంటివి చేశారని తెలుగుదేశం గత కొన్నేళ్లుగా విమర్శలు చేస్తున్నది. వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమన్న నిర్ధారణకు వచ్చేసిన సీఐడీ ఉన్నతాధికారులు.. చంద్రబాబు కేసులో, లోకేశ్ ను విచారించిన సమయంలో అక్రమంగా సేకరించిన ఆధారాలు కనిపించకుండా చేసే ఉద్దేశంతోనే కీలక పత్రాలను దగ్దం చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి సిట్ కార్యాలయం ఆవరణంలో దగ్దం చేసిన పత్రాల అంశంపై ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకుని కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ సర్వత్రా వినిపిస్తోంది.