చిత్తూరు దేశం ఎంపి చిటపటలు
posted on Apr 17, 2012 @ 11:00AM
చిత్తూరు లోక్ సభ సభ్యుడు డాక్టర్ ఎన్.శివప్రసాద్ ఇటీవల చీటికీ మాటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. తమను పార్టీ నాయకులు గుర్తించటం లేదంటూ అధికార కార్యక్రమాలకు డుమ్మా కొడుతున్నారు. పార్టీ కోసం ఎంతగానో శ్రమించి ఎన్ని ఇబ్బందులు పడ్డా పార్టీ విజయానికి కృషి చేసిన తనను పార్టీ అధినేత కూడా పట్టించుకోవటం లేదనీ, తన సహచర నాయకులు తనను చులకనగా చూస్తున్నారనీ ఆయన వాపోతున్నారు. ఒకప్పుడు తనకు మంత్రిపదవి ఇవ్వలేదన్న ఆగ్రహంతో పార్టీ అధినేత చంద్రబాబునాయుడును తిట్టిపోసిన బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,
కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బాబును నిత్యం ప్రెస్ మీట్ లు పెట్టి మరీ విమర్శలు చేసిన ముద్దుకృష్ణమనాయుడు వంటి నాయకులను అందలం ఎక్కించి తనను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల తెలుగుదేశంపార్టీలోకి చెదలవాడ కృష్ణమూర్తిని తీసుకున్నారు. ఈ విషయమై తనతో ఎవరూ కనీసం సంప్రదించకపోవటం ఏమిటని ఆయన ప్రశ్నిస్తున్నారు. పార్టీలో తనకు జరుగుతున్నా అవమానాలతో పాటు ప్రభుత్వపరంగా కూడా జరుగుతున్నా అవమానాలను ఆయన తట్టుకోలేకపోతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా ఆయనను సరిగా పిలవటం లేదు. పిలిచినా ప్రోటోకాల్ పాటించడం లేదు. దీనిపై లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసినప్పటికీ పెద్దగా ఫలితం కనిపించలేదు.