బెడిసి కొట్టిన వ్యూహం.. జగన్ ‘చిరు’ ఆశలు గల్లంతు!
posted on Apr 10, 2024 @ 9:32AM
ఏపీలో సార్వత్రిక ఎన్నికల వేళ రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ వైసీపీ గ్రాఫ్ పడిపోతున్నది. దీంతో వైసీపీ అధిష్టానం ఎన్నికల వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కులాల మధ్య విద్వేషాలు రేపి రాజకీయ లబ్ధిపొందుతున్న వైసీపీ నేతలు.. వాటికి మరింత ఆజ్యం పోసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా అగ్రవర్ణాలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మధ్య విద్వేషాలు సృష్టిస్తే బడుగు, బలహీన వర్గాల ఓట్లు గంపగుత్తగా తమ పార్టీ ఖాతాలో పడతాయని ఆ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ టార్గెట్ గా జగన్ మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారట. పిఠాపురం నియోజకవర్గంలో జగన్ ను ఓడించేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికి తోడు పవన్ కల్యాణ్ ను ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలు మొదలయ్యాయన్నచర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నది.
వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి తన ప్రత్యర్థులపై కుల ముద్ర వేయడం ద్వారా రాజకీయంగా వారి ఎదుగుదలను దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తుంటారు. గత ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడుపై క కులం ముద్ర వేయడం ద్వారా తెలుగుదేశం పార్టీకి బీసీలను దూరం చేయడంలో ఓ మేరకు సఫలమయ్యారు. అసలు విషయానికి వస్తే తెలుగుదేశం పార్టీకి బలమైన ఓటు బ్యాంకు బీసీలు. చంద్రబాబు నాయుడు సైతం పార్టీ పదవుల్లో బీసీలకే అధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే గత ఎన్నికల సమయంలో జగన్మాయా ప్రచారంలో పడి పొరపాటుపడిన బీసీలు ఎన్నికల తరువాత జగన్ కుట్రలను తెలుసుకున్నారు. ఇప్పుడు బీసీ వర్గాల్లో మెజార్టీ ప్రజలు చంద్రబాబు వైపు నిలుస్తున్నారు. గతంలో చంద్రబాబుపై కుల ముద్ర వేసిన తరహాలోనే.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పైనా కుల ముద్ర వేసేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే పవన్ జగన్ కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ వస్తున్నారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తాను ఒక కులానికి నాయుడిని కాదు.. కులాలకు అతీతమైన వ్యక్తిని.. అన్ని కులాల ప్రజలు తన కుటుంబ సభ్యులేనని చెబుతూ వచ్చారు. అయినా, కేవలం కాపు సామాజిక వర్గానికే పవన్ కల్యాణ్ నాయకుడు అని వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు.
విజయవాడ పశ్చిమ సీటును తనకు కేటాయించలేదని జనసేన పార్టీకి ఆ పార్టీ కీలక నేత పోతిన మహేశ్ రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, పవన్ కల్యాణ్ ను కాపు నాయకుడిగా ముద్రవేసే ప్రయత్నం చేశారు. పొత్తులో భాగంగా పవన్ 21 సీట్లు తీసుకోవడం మహా పాపమని.. కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని పోతిన మహేశ్ విమర్శలు చేశాడు. ఇక్కడ అర్ధంకాని విషయం ఏమిటంటే.. 21సీట్లకు కాపుల ఆత్మగౌరవానికి సంబంధం ఏమిటి? జనసేన అంటే కాపుల పార్టీ అని పవన్ కల్యాణ్ ఎక్కడైనా చెప్పారా? పదేపదే పవన్ కల్యాణ్ ను కాపు సామాజికవర్గానికే పరిమితమైన నాయకుడుగా చిత్రీకరించే ప్రయత్నం జగన్ మోహన్‌రెడ్డి చేస్తున్నారు. పవన్ కల్యాణ్ పై కాపు ముద్రవేస్తే తనకు బలంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకును వైసీపీ వైపునకు మళ్లించుకోవచ్చని జగన్ రాజకీయ వ్యూహంలో భాగంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జగన్ మోహన్ రెడ్డి పక్కన అందరూ రెడ్డి కులానికి చెందిన నాయకులు, అధికారులే ఉంటారు. కానీ జగన్ మాత్రం.. తాను బీసీ, ఎస్సీ, ఎస్టీల మనిషి అంటూ ప్రసంగాల్లో దంచేస్తుంటారు. అంటే.. సొంత సామాజిక వర్గానికి లబ్ధిచేకూర్చే జగన్ అన్నివర్గాల మనిషి కావాలి, అన్నివర్గాల ప్రజలు నా వాళ్లే అనుకునే చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై మాత్రం కులం ముద్ర వేయాలి. ఇదే జగన్, ఆయన వర్గీయుల కుట్రగా పరిశీలకులు పలు సందర్భాలలో విశ్లేషించారు. వైసీపీ నీచరాజకీయాలకు కేరాఫ్ అని గుర్తించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్.. వారి కుట్రలను ఎప్పటికప్పుడు చేధిస్తూ ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు.
మరోవైపు పవన్ కల్యాణ్ ను దెబ్బతీసే ప్రయత్నంలో భాగంగా.. చిరంజీవి విషయంలోనూ వైసీపీ మైండ్ గేమ్స్ ఆడింది. చిరంజీవి ప్రత్యక్ష రాజకీయాల్లోకి మళ్లీ వచ్చే ఉద్దేశం లేదని చెప్పినా.. వైసీపీకి చిరు మద్దతు ఉన్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. సొంత తమ్ముడు పెట్టిన పార్టీ గురించి చిరంజీవి కూడా ఎక్కడా మాట్లాడకపోవటంతో జనసేన క్యాడర్ లో అది నిజమేనా అన్న అనుమానాలూ వ్యక్తమయ్యాయి. మెగా ఫ్యాన్స్ లో కూడా ఇదే రకమైన సందేహాలు నెలకొన్నాయి. ఎన్నికల సమయంలో చిరు, పవన్ ఫ్యాన్స్ మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అందుకు అవకాశం లేకుండా చిరంజీవి తాను ఎటువైపో తేటతెల్లం చేసేశారు. జనసేన పార్టీకోసం ఐదు కోట్ల చెక్కును పవన్ కల్యాణ్ కు అందివ్వడం ద్వారా తన మద్దతు కూటమికే అని చిరంజీవి విస్పష్టంగా చెప్పేశారు. దీంతో జనసేన శ్రేణుల్లో జోష్ పెరిగింది. మెగా ఫ్యాన్స్ లో అయోమయం పోయింది. జగన్ వ్యూహాలు బెడిసికొట్టడమే కాకుండా, ఆయన కుట్రపూరిత ఎత్తుగడలు ఏమిటన్నది జనానికి స్పష్టంగా అర్ధమైంది.