చైనాలో జోరుగా పులుల పెంపకం, అమ్మకం
posted on Oct 5, 2020 @ 3:51PM
వన్యప్రాణుల వాణిజ్యానికి పాల్పడుతున్న చైనా
పులి ఎముకలతో వైన్ తయారుచేస్తన్న డ్రాగన్ కంట్రీ
కదిలే జంతువులు ఏవైనా సరే వారికి ఆహారంగా మారాల్సిందే.. పాములు, కప్పలే కాదు వన్యప్రాణులను కూడా తింటారు చైనీయులు. టైగర్ ఫామ్స్ ఏర్పాటుచేసి పులులను వాణిజ్యపరంగా పెంచుతున్నారు. అంతరించిపోతున్న పులులను రక్షించాలని అంతర్జాతీయంగా ఎన్నో సంస్థలు చేస్తున్న ప్రయత్నాలను లెక్కచేయకుండా చైనా మాత్రం యధేచ్ఛగా పులులను పెంచుతుంది. చైనాలో అక్రమంగా పులుల పెంపకం కొనసాగుతుందని అనేక అంతర్జాతీయ వార్తా సంస్థల పరిశోధనలో వెల్లడైంది. పౌరుషానికి ప్రతికగా భావించే పులి శరీరభాగాలను ధరించడాన్ని గొప్పగా భావిస్తారు అక్కడి ప్రజలు. అంతేకాదు పులి ఎముకల నుంచి తయారుచేసిన వైన్ తాగడం వల్ల బలవంతులుగా అవుతారని విశ్వసిస్తారు. ఖరీదైనప్పటికీ టైగర్ వైన్ సేవించడానికి ఆసక్తి చూపిస్తారు. అందుకే చైనాలో పులి ఎముకల నుంచి తయారుచేసిన వైన్ కు భలే గిరాకీ ఉంది. చట్టాలను అతిక్రమించి మరీ తయారుచేస్తున్నారు. పులి గోరు నుంచి చర్మం, ఎముకలు, మాంసం అన్నీ వాణిజ్యంగా ఉపయోగిస్తారు. టైగర్ ఫామ్స్ లో పర్యాటకులకు పులుల మధ్యన తిరిగేందుకు, పులి కూనలను ఎత్తుకునేందుకు కూడా అనుమతిస్తారు.
డబ్ల్యుడబ్ల్యుఎఫ్, ఎన్విరాన్‌మెంటల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ వంటి జంతు ప్రచారకులు టైగర్ ఫామ్స్ పై నిఘా ఏర్పాటుచేసి అనేక వాస్తవాలను వెల్లడించారు. వన్యప్రాణులను వాణిజ్యపరంగా పెంచడం నేరం. టైగర్ బోన్ వైన్ అమ్మకాన్ని చైనాలో 1993 లో నిషేధించారు. కాని ఇప్పటికీ చైనాలో ఈ వైన్ దొరుకుతుంది. అయితే చాలా తెలివిగా టైగర్ అన్న పేరు లేకుండానే దీనిని రహస్యంగా అమ్ముతున్నారు. ఇది టైగర్ బోన్ వైన్ అని రుజువు చేసేలా పులి గోరు, పంజాలను కూడా చూపిస్తారు. ఈ అమ్మకాలు చాలా రహస్యంగా స్థానికులకు మాత్రమే తెలిసేలా జరుగుతాయి. టైగర్ కు సంబంధించిన అన్నింటిని వాణిజ్యపరంగా మార్కెట్ లో ఉంచుతున్నారు.
ప్రపంచంలోనే పులి బలమైన జంతువు అని చైనా ప్రజలు నమ్ముతారు. కాబట్టి పులి శరీరభాగాలను ధరించడం, ఎముకల నుంచి ఉత్పత్తి చేసిన వైన్ తాగడం వల్ల తాము బలంగా తయారవుతామని వారి విశ్వాసం. ప్రాచీన ఔషధాల తయారీలోనూ పులి వైన్ ఆర్థరైటిస్ వంటి అనారోగ్య సమస్యలను దూరం చేస్తుందని నమ్ముతారు. తమ సంపదనకు చిహ్నంగా పులి శరీర భాగాలను బహుమతులుగా ఇచ్చిపుచ్చుకుంటారు.
భూమిపై అంతరించి పోతున్న అనేక జీవజాతుల్లో పెద్దపులి ఒకటి. ఇప్పటికే ఆసియా ఖండంలోని లావోస్, కంబోడియా, వియత్నాం వంటి దేశాల్లో దాదాపు కనుమరుగైపోయింది. ఇక మన దేశంలో పులుల సంఖ్య పెరుగుతున్నా వాటిని వేటాడి స్మగ్లింగ్ చేసేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఇక ఆసియా ఖండంలో ఉన్న దాదాపు 8000వేల పులుల్లో సగానికన్నా ఎక్కువే చైనాలోనే ఉన్నాయి టైగర్ ఫామ్స్ లో బందీలుగా..
టైగర్ ఫామ్ అనేది మన దేశంలో పశువులను, మేకలను, గొర్రెలను, కోళ్లను పెంచినట్టే అక్కడ పులులను పెంచుతారు. పులులు చూసేందుకు, వాటితో సెల్ఫీలు తీసుకునేందుకు పర్యాటకులను అనుమతిస్తారు. వేగంగా పులులు పెరిగేలా, దృఢంగా అయ్యేలా ఆహారం ఇస్తారు. పులికూనలను తల్లి నుంచి వేరుచేసి పెంచుతారు. ఔషధాల తయారీలో వాడకం కోసం వాటిని చంపుతారు. చైనాలో పులుల అక్రమ పెంపకం, వాటి శరీరభాగాల అక్రమ రవాణాపై అనుమానంతో అధికారులు దాడి చేసిన ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన థాయిలాండ్ లోని టైగర్ టెంపుల్ వంటి జంతుప్రదర్శనశాల్లో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చారు.
చైనాలో టైగర్ ఎముకల నుంచి తయారుచేసిన వైన్ ఇష్టంగా తాగుతారు. ఇది బలాన్ని ఇస్తుందని వారు నమ్ముతారు. ఈ వైన్ ను అంతర్జాతీయ సంస్థలు నిషేధించడంతో చాలా తెలివిగా చైనా సెల్లర్స్ టైగర్ అనే పదాన్ని లేబుల్ నుండి తీసివేశారు. పులి ఎముకల పొడితో తయారుచేసిన మాత్రలు రుమాటిజానికి నివారణగా వాడతారు. అంతేకాదు పులి పురుషాంగం కామోద్దీపన కలిగిస్తుందని అక్కడి ప్రజల నమ్మకం. పులి భాగాలను స్థితి చిహ్నంగా కూడా ఉపయోగిస్తారు. పులి చర్మం ముక్కలు కలిగిన తాయెత్తులతో పులి రగ్గులు, కంఠహారాలుగా మారి యజమాని సంపదకు, ప్రతిష్టకు చిహ్నలుగా భావిస్తారు. పులి గోర్లు, దంతాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అంతేకాదు కొన్ని చోట్ల నాన్ వెజిటేరియన్ మెనులో పులి మాంసం కూడా ఉంటుంది.
చైనాలో దాదాపు 200 టైగర్ ఫామ్స్ లో దాదాపు 6,000 పులులు బందీగా ఉన్నాయి. ఆగ్నేయాసియాలోని ఉన్న పులుల సంఖ్య దాదాపు 8,000 కాగా అందులో అత్యధిక శాతం చైనాలోనే టైగర్ ఫామ్స్ లోనే ఉన్నాయి. 2007 లో CITES( Convention on International Trade in Endangered Species of Wild Fauna and Flora ) సమావేశంలో పులులను వ్యాపార అవసరాల కోసం వాణిజ్యపరంగా పెంచవద్దని తీర్మానం చేశారు. 171దేశాలు దీనిపై సంతకాలు చేశాయి. చైనా కూడా సంతకం చేసింది. అయితే 1981లోనే చైనా పులులను వాణిజ్యవస్తువులుగా వినియోగించని సంతకం చేసింది. అయినా నిబంధనలను ఖాతరు చేయలేదు. ఆ తర్వాత మరోసారి దేశీయం కూడా పులుల శరీరభాగాలను వ్యాపార వస్తువులుగా పరిగణించను అంటూ సంతకం చేసింది. అయినప్పటికీ చైనా మాటపై ఉండలేదు. వాణిజ్య అవసరాల కోసం టైగర్ ఫామ్స్ ఏర్పాటుచేశారు. ఆ తర్వాత 2007లో CITES తీర్మానానికి అంగీకరించింది. అయితే ఏ నిబంధనలను కూడా చైనా పాటించలేదు. దాంతో తిరిగి 2016లోనూ చైనాలో పులుల పెంపకం అంతర్జాతీయంగా చర్చకు వచ్చింది. పులల సంరక్షణ కోసమే టైగర్ ఫామ్స్ ఉన్నయి తప్ప వాటిని హింసించడం లేదని చైనా మరోమారు దబాయించింది. అంతర్జాతీయ సంస్థల కన్నుగప్పి యదేఛ్చగా పులుల శరీరభాగాలను మార్కెటింగ్ చేస్తూ అంతర్జాతీయ విపణిలో డిమాండ్ పెంచింది. దాంతో చాలా దేశాల్లో పులుల వేట పెరిగింది.
చైనాలో దాదాపు 20 ఫామ్స్ లో ఆరువేలకు పైగా పులులు పెంచుతున్నారు. ముఖ్యంగా ముదాంజియాంగ్ , ఈశాన్య చైనాలో, హెలాంగ్ జియాంగ్ ప్రావిన్స్ లో టైగర్ ఫామ్స్ ఎక్కువగా ఉన్నాయి. పులులను వాణిజ్యపరంగా పెంచడం 1986లోనే చైనా మొదలుపెట్టింది. చాలా అంతర్జాతీయ సంస్థలు ఇందుకు అభ్యంతరం చెప్పగా దొంగచాటుగా పులుల పెంపకం కొనసాగించింది. 2010లో హర్బిన్ సైబీరియన్ పార్క్ లో 200 పులులు ఫ్రీజర్ లో బయటపడిన సంఘటనతో చైనా పులి జాతిపై విసిరిన పంజా ప్రపంచదేశాలకు తెలిసింది. 2008లో చైనాలోని ప్రధాన ఆరు నగరాల్లో జరిపిన సర్వేలో పులులను రక్షించాలన్న ఆలోచన కన్నా వాటి శరీరభాగాలను ధరించాలన్న ఆసక్తే చైనీయుల్లో ఎక్కువగా కనిపించింది. దాంతో పులి గోరు నుంచి చర్మం వరకు ప్రతిదీ మార్కెట్ చేసేందుకు చైనా సిద్ధపడింది. ఆర్థికలాభాలకే అధిక ప్రాధాన్యత ఇచ్చే వన్యప్రాణులను వాణిజ్యఅవసరాల కోసం పెంచుతుంది. చట్టాలను అతిక్రమిస్తూ జోరుగా పులుల పెంపకం చేస్తోంది. ప్రపంచదేశాల కన్నుగప్పి తాను ఆర్థికంగా ఎదగాలనుకునే దుర్భుద్ధితో అంతరించిపోతున్న జీవులను సైతం ఆహారంగా తీసుకుంటుంది. ఈ డ్రాగన్ కంట్రి పులినే కాదు అవకాశం వస్తే ప్రపంచాన్నే కబళిస్తుంది అన్నది అందరం అంగీకరించే సత్యం.