అపజయాల పట్ల మనోవైఖరి ఎలా ఉండాలి?
posted on Aug 6, 2024 @ 9:53AM
అపజయాలు ప్రతి మనిషి జీవితంలో వస్తూనే ఉంటాయి. అపజయాలు లేకపోతే అసలు విజయానికి విలువ, విజయాలు అనుభూతి చెందలేదు. కానీ ప్రతి ఒక్కరూ అపజయం అనేది తమకు ఎదురు కాకూడదు అని అనుకుంటారు. అయితే అపజయాల విషయంలో మనిషి వైఖరి ఎలా ఉండాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
"ఒక వ్యక్తి వెయ్యిమార్లు విఫలుడైనా ఉన్నతమైన ఆదర్శానికి అంటిపెట్టుకుని ఉండాలి. అబద్ధాలు చెప్పడం రాని గోడలా ఉండడం కన్నా, తప్పు చేస్తూ ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవడం ఉత్తమం" అని అనేవారు స్వామి వివేకానంద. అబ్రహమ్ లింకన్ తమ దేశ పార్లమెంటు సభ్యుడవ్వాలనుకున్నాడు. అయితే అతని మొదటి ప్రయత్నం విఫలమైంది. వ్యాపారంలో భాగస్వామి అతణ్ణి మోసం చేశాడు. వ్యాపారం కోసం చేసిన అప్పుల బారినుంచి బయటపడడానికి 17 సంవత్సరాల కాలం పట్టింది. అతను వివాహం చేసుకున్న కొద్దికాలానికే మొదటి భార్య మరణించింది. గయ్యాళి అయిన రెండవ భార్య అతనికి పెద్ద తలనొప్పిగా మారింది. అయినా అతడు తన లక్ష్యసాధనకై శక్తినంతా ఉపయోగిస్తూ, చేస్తున్న ప్రయత్నాలను మానలేదు. చివరకు అతను ఎన్నికల్లో నెగ్గడమే కాకుండా, అమెరికా అధ్యక్షుడై, చరిత్రపుటల్లోకి ఎక్కాడు. వ్యక్తిగత సమస్యలకు జడవకుండా, ఉన్నత ఆదర్శాన్ని విడవకుండా ప్రయత్నించిన వారే ఏ కార్యాన్నైనా సాధించగలరు.
మనిషి వ్యక్తిగత, సామాజిక, మానసిక రంగాలలో తప్పకుండా అభివృద్ధి సాధించాలి. అలా సాధించినప్పుడు మనిషికి అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ప్రతి విషయాన్ని అర్థం చేసుకున్నప్పుడే ఆ విషయం లోతు ఎంత అనేది అర్థం అవుతుంది. లేకపోతే ఎప్పటికీ ఏమీ తెలియకుండా బెల్లం కొట్టిన రాయి చందాన మనిషి ప్రవర్తన కూడా ఏమీ పట్టనట్టు, ఏమీ తెలియని ముర్ఖుడిలా ఉండిపోతారు. ఇలా ఉంటే అపజయాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఏమీ నేర్చుకోలేరు. అపజయాల గురించి అసలు ఆలోచించలేరు. కేవలం అపజయాల కారణంగా తాము ఎదగలేక పోయామనే అసంతృప్తి మాత్రమే వాళ్ళలో కనిపిస్తుంది. కాబట్టి అపజయాలను అనుభవాలుగా చూసినప్పుడే మనిషి సరైన ఆలోచనా మార్గంలో ఉండగలుగుతారు.
*నిశ్శబ్ద.