అందెను నేడే అందని జాబిలి
posted on Aug 23, 2023 @ 7:47PM
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సరికొత్త రికార్డు సృష్టించింది. చంద్రుడి దక్షిణ దృవంపై అన్వేషణ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ సూపర్ సక్సెస్ అయింది. చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్.. నేడు అంటే ఆగస్ట్ 23వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 నిమిషాలకు సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో చంద్రుడి దక్షిణ దృవంపై అడుగుపెట్టిన తొలి దేశంగా భారత్ ఖ్యాతి గాంచింది.
చంద్రయాన్ విజయవంతం కావడంతో.. భారత్‌కు ప్రపంచదేశాలు నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు... ఈ చంద్రయాన్ 3 ప్రాజెక్ట్‌లో కీలక భూమిక పోషించిన ఇస్రో శాస్త్రవేత్తలు చేసుకొంటున్న సంబరాలు అంబరానంటాయి. మరోవైపు బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలోని జోహెన్సెస్‌బర్గ్ వెళ్లారు. ఆ క్రమంలో ప్రదాని నరేంద్ర మోదీ.. విక్రమ్ ల్యాండర్.. చంద్రడిపై ల్యాండ్ అయ్యే దృశ్యాలను జోహెన్నెస్‌బర్గ్ నుంచి వర్చువల్‌గా వీక్షించారు.
చంద్రయాన్-3 విజయవంతమైందని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేసిన ఆయన ఇలా స్పందించారు... చంద్రయాన్- 3 ఘన విజయంతో తన జీవితం ధన్యమైందన్నారు. అమృత కాలంలో తొలి ఘన విజయంగా ఆయన దీనిని అభివర్ణించారు. ఈ విజయం దేశం గర్వించే మహోన్నత ఘట్టమని మోదీ పేర్కొన్నారు.
ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల మంది భారతీయులు ఎదురు చూశారని ఆయన వివరించారు. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా.. తన మనస్సంతా.. చంద్రయాన్-3పైనే ఉందన్నారు. చంద్రయాన్-3 బృందం, ఇస్రో శాస్త్రవేత్తలకు ఈ సందర్భంగా మోదీ అభినందనలు తెలిపారు. ఈ క్షణం కోసం ఏన్నో ఏళ్లుగా ఎదురు చూశానని ప్రధాని మోదీ చెప్పారు.
ఈ ఏడాది జులై 14వ తేదీన శ్రీహరికోటలోని షార్ అంతరిక్ష కేంద్రం నుంచి చంద్రయాన్-3 ప్రాజెక్ట్‌ను ఇస్రో చేపట్టిన సంగతి తెలిసిందే. నాడు విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-3 మొత్తం 40 రోజుల్లో వివిధ దశలను పూర్తి చేసుకొని.. చంద్రుని మీదకు దిగింది. ఇస్రో గతంలో చేపట్టిన చంద్రయాన్- 2 విఫలం కావడంతో శాస్త్రవేత్తలు పలు జాగ్రత్తలు తీసుకొని.. చంద్రయాన్-3ని చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా రూపకల్పన చేశారు.