ప్రభుత్వ వైఫల్యాలపై జనంలోకి చంద్రబాబు.. రెండు నెలల పాటు విస్తృత పర్యటనలు
posted on Nov 1, 2022 @ 1:59PM
ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల నాలుగో తేదీ నుంచి రెండు నెలల పాటు విస్తృతంగా పర్యటనలు జరపాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వ వైఫల్యాలను మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఈ పర్యటనల ముఖ్య ఉద్దేశం అంటున్నారు. ఈ పర్యటనల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను మరిన్ని వర్గాల్లోకి తీసుకెళ్లడం, టీడీపీ శ్రేణులను మరింత క్రియాశీలం చేయడం లక్ష్యం అని చెబుతున్నారు.
గత మే నెలలో జరిగిన టీడీపీ మహానాడు తర్వాత ఒక్కో పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో మూడు రోజులు పర్యటించడం ద్వారా ఏడాదిలో అన్ని జిల్లాలు సందర్శించాలని అప్పట్లో కార్యక్రమాన్ని చంద్రబాబు ప్రకటించారు. అయితే.. భారీ వర్షాలు, వ్యవసాయ పనులు ముమ్మరం కావటంతో జిల్లాల పర్యటనలకు ఆయన విరామం ఇవ్వాల్సి వచ్చింది. దీంతో రెండు పార్లమెంటు స్థానాల పరిధిలో మాత్రమే అప్పుడు చంద్రబాబు పర్యటించగలిగారు. ఆ తర్వాత చాలా వరకు నియోజకవర్గాల పార్టీ ఇన్ చార్జులతో ముఖాముఖీ సమావేశాలు పూర్తిచేశారు. ఇప్పటికే 117 నియోజకవర్గాల ఇన్ చార్జులు లేదా సిటింగ్ ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమీక్షలు పూర్తయ్యాయి.
ఇప్పుడు వర్షాలు తగ్గుముఖం పట్టడంతో మళ్లీ జిల్లాల పర్యటనలకు చంద్రబాబు శ్రీకారం చుడుతున్నా రు. నవంబరు నాలుగో తేదీన ఎన్టీఆర్ జిల్లా నుంచి చంద్రబాబు పర్యటనలు ప్రారంభిస్తారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో ఆ రోజున చంద్రబాబు రెండు సభలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వారానికి మరో జిల్లా పర్యటన ఉండేలా టీడీపీలో ప్రణాళిక రూపొందుతోంది. పర్యటనలు మరింత పకడ్బందీగా నిర్వహించే నిమిత్తం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు ఈ విభాగం కన్వీనర్ గా వ్యవహరించనున్నారు. ఎమ్మెల్సీమంతెన సత్యనారాయణ రాజు సహ కన్వీనర్ గా ఉంటారు. గతం నుంచి ఈ కార్యక్రమాల సమన్వయకర్తలుగా వ్యవహరిస్తున్న గంటా గౌతం, పత్తిపాటి శ్రీనివాస్ లనూ అందులో కొనసాగిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ స్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు హయాం నుంచీ పార్టీ పర్యటనల ఏర్పాట్లను కంభంపాటి చూస్తు న్నారు. దీంతో ఆయనకే మళ్లీ బాధ్యతలు అప్పగించారు. పర్యటనల విభాగం కొద్ది రోజుల క్రితం పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబుతో సమావేశమై పర్యటనల వ్యూహంపై చర్చించింది.
ఇలా ఉండగా.. జనవరిలో సంక్రాంతి పండుగ తర్వాత నుంచి టీడీపీ యువ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నారు. కుప్పంలో ప్రారంభమయ్యే లోకేశ్ పాదయాత్ర సుమారు ఏడాది పాటు సాగనుంది. ఈ లోగా నవంబర్, డిసెంబర్ నెలల్లో పార్టీ చీఫ్ చంద్రబాబు పర్యటనలు కొనసాగుతాయి.