మర్యాదగా ఉండదంటూ స్పీకర్ పై బాబు సంచలన వ్యాఖ్యలు.. స్పీకర్ ఊహించని రియాక్షన్
posted on Dec 11, 2019 @ 10:40AM
ఏపీ అసెంబ్లీ సమావేశాలు తెలుగు కమర్షియల్ సినిమాని తలపిస్తున్నాయి. పవర్ ఫుల్ డైలాగులు, ఛాలెంజ్ లు, వార్నింగ్ లు, నవ్వులు అబ్బో ఇలా నవరసాలను ప్రజాప్రతినిధులు ప్రదర్శిస్తున్నారు. సినిమా చూసినా రాని కిక్ ఏపీ అసెంబ్లీ సమావేశాలు చూస్తే వస్తుందని సోషల్ మీడియాలో సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి. ప్రతిపక్ష నేత చంద్రబాబు అయితే.. హెరిటేజ్ ఫ్రెష్ తనదని రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తానని కూడా సీఎం వైఎస్ జగన్ కి ఛాలెంజ్ విసిరారు. ఇప్పటివరకు ఛాలెంజ్ లు, సెటైర్లతో సరిపెట్టిన బాబు.. తాజాగా ఏకంగా స్పీకర్ పైనే సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుపై మాట్లాడుతున్న చంద్రబాబును స్పీకర్ అడ్డుకొనే ప్రయత్నం చేశారు. దీంతో మేం మాట్లాడితే అడ్డుకుంటున్నారని ప్రభుత్వ తీరుపై చంద్రబాబు మండిపడ్డారు. స్పీకర్‌కు మర్యాదగా ఉండదంటూ వ్యాఖ్యలు చేశారు. స్పీకర్‌కు సభ్యత లేదంటూ కూడా బాబు వ్యాఖ్యానించారు. దీంతో స్పీకర్ తమ్మినేని సీతారాం.. బాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు. స్పీకర్ స్థానంపై మీరు అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. బాబు తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు వ్యవహరించాలన్నారు స్పీకర్. ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. స్పీకర్ ను వేలు పెట్టి చూపిస్తూ, విమర్శించడం దారుణమని అన్నారు. స్పీకర్ స్థానాన్ని అగౌరవపరిచిన ప్రతిపక్ష నేతపై సభలో చర్చ జరగాలని, సభలో మర్యాద పాటించని వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. సభ నుంచి బాబును సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మిగతా వైసీపీ సభ్యులు కూడా బాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాబుని సభ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. అయితే.. వైసీపీ సభ్యులు మాట్లాడిన అనంతరం స్పీకర్ మాట్లాడుతూ.. సభను ముందుకు నడిపించాల్సిన బాధ్యత తనకు ఉన్నందున.. చంద్రబాబును మన్నిస్తున్నానని, ఆ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని వ్యాఖ్యానించారు.