అంగళ్ళు కేసులో చంద్రబాబుకు హైకోర్టులో ఊరట
posted on Oct 13, 2023 @ 12:45PM
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఒక్కొక్కటిగా కేసుల్లో ఊరట లభిస్తోంది. అంగళ్ళు కేసులో చంద్రబాబుకు నేడు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పును వెలువరించింది. లక్షరూపాయలు పూచీ కత్తుతో బెయిల్ మంజూరు చేసింది.
ఇటీవలె రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో చంద్రబాబుకు హైకోర్టులో తాత్కాలికంగా స్వల్ప ఉపశమనం లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారెంటుపై విచారణ ప్రక్రియను న్యాయస్థానం ఈ నెల 16 వరకూ నిలుపుదల చేసింది. పీటీ వారెంటు విషయంలో ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయవద్దని ఏసీబీ కోర్టుకు స్పష్టం చేసింది. పీటీ వారెంటు విధానంలో తప్ప జ్యుడీషియల్ కస్టడీలోఉన్న పిటిషనర్‌ను నేరుగా అరెస్టు చేసే ఉద్దేశం లేదని సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ లిఖితపూర్వకంగా సమర్పించిన హామీని న్యాయస్థానం రికార్డుచేసింది. విచారణను16వ తేదీకి వాయిదా వేసింది. ఇక నేడు అంగళ్లు కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ లభించడంలో టీడీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి.
వరుస కేసులు, వరుస పిటిషిన్లు, వాటికి ఏమాత్రం తగ్గకుండా వరుస షాకులు... లోపల చంద్రబాబుకు, బయట టీడీపీ శ్రేణులకు ఉక్కబోత తప్పడం లేదని... ఈ ఉక్కబోతముందు రోహిణీకార్తి ఎండలు అసలు పరిగణలోకే రావనే కామెంట్లు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ స్కిల్ స్కాం కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. చంద్రబాబుకు అడుగడుగునా చుక్కెదురవతూ వస్తోంది.
చంద్రబాబు లాయర్లు ఎంతో వ్యూహాత్మకం కథను నడుపుతున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో బలంగా ఈ మేరకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబును పూర్తిగా బయటపడేయాలన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రముఖ జర్నలిస్ట్ సాయి కూడా వెల్లడించారు. చంద్రబాబు లాయర్లు ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అన్నారు.