#చంద్రబాబు లైఫ్ ఎట్ రిస్క్?
posted on Oct 14, 2023 @ 10:06AM
తెలుగు దేశం అధినేత, ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ తర్వాత జరుగతున్న సంఘటనలు గమనిస్తే, అక్రమ అరెస్ట్ వెనక మరో మహా కుట్ర దాగుందనే అనుమానం ఎవరికైనా కలుగుతుంది. ఓ వంక చంద్రబాబు ప్రమేయమే లేని, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసిన జగన్ రెడ్డి ప్రభుత్వం అంతటితో ఆగకుండా ఇంకా ఇంకా తప్పుడు కేసులు పెట్టి పీటీ (ప్రిజన్ ట్రాన్ఫర్) వారెంట్లు సిద్దం చేస్తోంది. అందుకే చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేమని ఒక నిర్ణయానికి వచ్చిన జగన్ రెడ్డి ఆయనకు భౌతిక హాని తలపెట్టే కుట్రలు చేస్తున్నారనే అనుమనాలు, ఆయన కుటుంబ సభ్యులలోనే కాదు, అందరిలో కలుగుతున్నాయి.
అందులోనూ జగన్ రెడ్డి చరిత్ర తెలిసిన ఎవరికైనా అలాంటి అనుమానాలు కలగడం సహజం. సొంత బాబాయ్ ‘మర్డర్’ కేసులో సొంత కుటుంబ సభ్యులే ఆయన వైపు వేలెత్తి చూపుతున్నారు. కన్నతండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తర్వాత, శవం కదలక ముందే ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన చేసిన ‘సంతకాల’ ప్రయత్నం, రాజకీయంగా తల్లీ, చెల్లి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు జగన్ రెడ్డి అధికారం కోసం ఏమైనా చేస్తారు, ఎంతకైనా తెగిస్తారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలుగా నిలుస్తాయి. నిలుస్తున్నాయి. అందుకే జగన్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టినా తలపెడతారు అనే అనుమనాలు సహజంగానే అందరిలో వ్యక్త మవుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే, నెల రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్‌లో జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడి ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నెల రోజుల సమయంలో చంద్రబాబు 5 కిలోలు బరువు తగ్గారని, ఆయనకు స్టెరాయిడ్స్ ఇస్తున్నారని.. ఆయన ప్రాణాలకు ముప్పు ఉందని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఇతర కుటుంబ సభ్యులతో పాటుగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, రాజకీయలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు, సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
చివరకు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నివేదికలపై విశ్వాసం లేకనో ఏమో, చంద్రబాబు నాయుడు కుమారుడు, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ను పిలిపించుకుని చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగితెలుసు కున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ను చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసు కున్నారు. పార్లమెంట్ -20 సమావేశంలో ప్రధాని మోడీని కలిసిన కనకమేడలను జైల్లో ఉన్న చంద్రబాబు ఆరోగ్యం గురించి మోడీ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కనకమేడల.. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితితో పాటుగా కేసుల పూర్వాపరాలను కుడా ప్రధానికి వివరించారు.
ఇలా నెలరోజులకు పైగా జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఆరోగ్యం గురించి ప్రధానమంత్రి మొదలు సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఆందోళన వ్యక్తం చేస్తుంటే, వైసీపీ నాయకులు మాత్రం, ఎవరి కళ్ళలో ఆనందం చూసేందుకో ఏమో కానీ, మానవత్వాన్ని మరిచి వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి తన భర్త చంద్రబాబు ఇప్పటికే 5 కిలోల బరువు తగ్గారని, ఇంకా బరుగు తగ్గితే కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తే , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని తేలిగ్గా తీసి పడేశారు.చంద్రబాబు జైల్లో బరువు తగ్గలేదు ఒక కిలో బరువు పెరిగారని ఆయన నవ్వుతూ తన విషపు కోరలు బయట పెట్టుకున్నారు. వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. ఆలాగే మరింతగా దిగజారి చంద్రబాబుకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే ప్రమాదం ఉందని నీచాతినీచమైన, అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. 73 ఏళ్ల వయసున్న నాయకుడి ఆరోగ్యంపైనా అవహేళనగా మాట్లాడి తమ ధోరణి ఎలాంటిదో మరోసారి ప్రపంచానికి చాటుకున్నారు.
నిజానికి చంద్రబాబుకు వయసు రీత్యానే కాదు, 35 సంవత్సరాలకు పైగా ఆయనకు ఉన్న ఆరోగ్య సమస్య రీత్యా ప్రత్యేక వైద్యం,. ప్రత్యేక సదుపాయాలు అవసరం. ఆరోగ్య అవసరాల దృష్ట్యా చల్లటి వాతావరణం (ఏసీ) లో ఉండటం అవసరం. జైల్లో ఆ సదుపాయం లేదు. దీంతో,35ఏళ్ల కిందటి సమస్య 30 రోజుల కారాగారంలో తిరగబెట్టింది.అదే విషయాన్ని కుటుంబ సభ్యులు ప్రస్తావించారు. రక్తబంధం, మానవ సంబంధాల విలువ తెలిసిన చంద్రబాబు కుటుంబ సభ్యులు సహజంగానే ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, వైసీపీ నాయకులు చంద్రబాబు ఆరోగ్య సమస్యలను కూడా అవహేళన చేస్తున్నారు. ఏసీ ఇవ్వడానికి అత్తగారిల్లా?’ అని ప్రభుత్వ పెద్దలు వెకిలిగా మాట్లాడుతున్నారు.‘స్కిన్ అలర్జీతో ప్రాణాలు పోతాయా?’ అనే దారుణ వ్యాఖ్యలు చేస్తున్నారు.
అయితే వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్ రెడ్డి (ఎంపీ అవినాశ్ తండ్రి) తనకు నలతగా ఉందనగానే హుటాహుటిన నిమ్స్‌కు తరలించారు. ఆయనకు ఆరోగ్య కారణాలతో ‘ఎస్కార్ట్’ పెరోల్ కూడా వచ్చింది. దానిని కోర్టు మళ్లీ మళ్లీ పొడిగిస్తోంది కూడా! భాస్కర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి వల్లే కోర్టు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు. అవహేళనగా మాట్లాడలేదు. చంద్రబాబు విషయంలో ప్రభుత్వ పెద్దలు నోరు పారేసుకోవడం గమనార్హం. అయితే వైసేపీ నాయకులు ఒక విషయం గమనించడం లేదు. అధికార మదంతో సభ్యత, సంస్కారం మరిచి చేసే ఇటువంటి విపరీత వ్యాఖ్యలను ప్రజులు ఎప్పుడూ సహించరు. ఇది చరిత్ర పదే పదే చెబుతున్న సత్యం. చంద్రబాబు హెల్త్ బులిటిన్ లో ఆయనకు నిర్వహించిన వైద్య పరీక్షల వివరాలు చూస్తే.. అసలు వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారా అన్న అనుమానం కలగడం సహజం.
డయాబెటిక్ అయిన చంద్రబాబు సుగర్ లెవెల్స కూడా చెక్ చేయకుండా ఆయనకు పరీక్షలు నిర్వహించామంటూ వెల్లడించడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పైగా ప్రతి రోజూ హెల్త్ బులిటిన్ విడుదల చేయాలన్న డిమాండ్ పై స్పందించిన సజ్జల అలా హెల్త్ బులిటిన్ రిలీజ్ చేయరని చెబుతూ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబుకు తీవ్రమైన హాని తలపెట్టేందుకే వైసీపీ సర్కార్ నిర్ణయించుకుందన్న అనుమానాలకు తావిస్తున్నది. అంతే కాకుండా సజ్జల ప్రెస్ మీట్ లో ఏం చెప్పారో, అవే వివరాలను జైళ్ల డీజీ రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడటం చూస్తుంటే ఏదో మహాకుట్ర జరుగుతోందన్న అనమానాలు వ్యక్తం కావడం సహజం అని పరిశీలకులు చెబుతున్నారు.