ఎల్లుండి విగ్రహప్రతిష్టోత్సవ కార్యక్రమానికి బయలు దేరనున్న చంద్రబాబు
posted on Jan 19, 2024 @ 1:51PM
ప్రస్తుతం అయోధ్యలో రాముడి విగ్రహ ప్రతిష్టోత్సవం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆహ్వానం అందలేదు. కానీ కాంగ్రెస్ హైకమాండ్ కు ఆహ్వానం అందినప్పటికీ ఈ కార్యక్రమానికి హాజరుకాకూడదని నిర్ణయించింది. కానీ ;ఎన్ డి ఎ భాగస్వామిగా లేని టిడిపికి ఆహ్వానం అందింది. . గతంలో టిడిపి ఎన్ డి ఏ భాగస్వామిగా ఉన్న సంగతి తెలిసిందే.. రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు వెళుతున్నారు. ఈ నెల 21వ తేదీ సాయంత్రం ఆయన అయోధ్యకు బయల్దేరుతున్నారు. 22న జరిగే విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. కార్యక్రమానికి రావాలని కోరుతూ శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు రెండు రోజుల క్రితం చంద్రబాబును ఆహ్వానించారు.
జనవరి 22 మధ్యాహ్నం 12.20 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది. నిన్ననే గర్భ గుడిలోకి రాముడి విగ్రహాన్ని చేర్చారు. విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి 8 వేల మంది వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు వెళ్లాయి. సమయం దగ్గర పడుతుండటంతో ఆహ్వానాలను అందించే ప్రక్రియను నిర్వాహకులు వేగవంతం చేశారు.
దేశ వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుండి ప్రత్యేక బస్సులు, ప్రత్యెక రైళ్ళు కూడా ఏర్పాటు చేసి భక్తులను అయోధ్యకు చేర్చనున్నారు. అయోధ్యలో రామయ్యకు జరిగే పట్టాభిషేకాన్ని చూడాలని ఆ మహత్కార్యాన్ని కళ్ళారా చూసి తరించాలని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురు చూస్తున్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాలుగా నిరీక్షిస్తున్న వారందరి కోరిక తీరుతున్న సమయంలో రామయ్య తాను పుట్టిన నేలమీద తిరిగి నడయాడబోతున్నాడు.ఇదే సమయంలో దేశ, విదేశాలలోని ప్రముఖులకు రామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వానాలను పంపిస్తున్నారు రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ నిర్వాహకులు, విశ్వహిందూ పరిషత్ నిర్వాహకులు. ఇప్పటికే అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం, శ్రీరామ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పలువురు ఏపీ నేతలకు ఆహ్వానం అందింది. సినీ నటులు చిరంజీవికి, మోహన్ బాబు తదితరులకు కూడా ఆహ్వానాలు అందాయి. విగ్రహ ప్రతిష్టాపనకు నిన్నటి నుండి సాంప్రదాయబద్ధమైన ముందస్తు క్రతువులు ప్రారంభమయ్యాయి. 22వ తేదీన జరగనున్న ఈ చారిత్రాత్మక ఘట్టానికి 150 దేశాల నుంచి నాలుగు వేల మంది ప్రముఖులు అతిథులుగా హాజరుకానున్నారు. అక్కడకు వెళ్ళే అతిధుల కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు. టెంట్ హౌస్ లను నిర్మించి వారికి కావాల్సిన వసతి సౌకర్యం కల్పించే పనిలో ఉన్నారు.