కరోనా కంటే జగన్ వైరస్ ప్రమాదకరం: చంద్రబాబు
posted on Nov 3, 2020 @ 4:25PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత చంద్రబాబు మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ను పట్టిపీడిస్తున్న కరోనా వైరస్ కంటే... అంతకంటే ఎక్కువ పీడిస్తున్న జగన్ వైరస్ ప్రమాదకరమని చెప్పారు. పార్టీ నాయకులతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో 175 నియోజవర్గాలకు చెందిన పార్టీ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. కరోనా కంటే జగన్ ప్రమాదకరమని వీడియో కాన్ఫరెన్స్ లో పార్టీ నేతలతో చెప్పారు చంద్రబాబు. ఫేక్ వార్తలను కూడా నిజాలుగా చూపించి, జనాలను నమ్మించగల ఘనుడు జగన్ అని విమర్శించారు.
కుల, మత విద్వేషాలను రగిలించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంలో కూడా జగన్ ఆరితేరిపోయారని టీడీపీ అధినేత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు బురద చల్లడం సాధారణ అంశంగా మారిపోయిందని మండిపడ్డారు చంద్రబాబు. కేంద్రమంత్రి పేరుతో మోసగించిన వాడితో కేసులు వేయిస్తారు. పేకాట దందాలు నడిపేవాడితో కేసులు వేయిస్తారు. క్రిమినల్స్‌ను అడ్డం పెట్టుకుని భయానక వాతావరణం సృష్టిస్తున్నారు అని సీఎం జగన్‌పై ధ్వజమెత్తారు.
‘‘నా ఇల్లు- నా స్వంతం’’, ‘‘నా స్థలం-నాకు ఇవ్వాలి’’ అంటూ రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు టీడీపీ పిలుపునిచ్చింది. ప్రజా ఆందోళనలను రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించాలని, లబ్ధిదారులైన పేద కుటుంబాలకు అండగా ఉండాలని పార్టీ నేతలను ఆదేశించారు చంద్రబాబు. వాళ్ల ఇళ్లు, వాళ్ల స్వాధీనం అయ్యేదాకా బాధితుల తరఫున పోరాడాలని సూచించారు. కట్టిన ఇళ్ల వల్ల టీడీపీకి మంచిపేరు వస్తుందనే అక్కసుతో వాటిని నాశనం చేయడమే లక్ష్యంగా వైసీపీ పెట్టుకుందని చంద్రబాబు ఆరోపించారు. డిపాజిట్ కట్టిన పేదలకు ఇళ్లు ఇవ్వకుండా వైసీపీ నమ్మకద్రోహం చేసింద్నారు, తమ కష్టార్జితాన్ని డిపాజిట్లుగా చెల్లించి, లాటరీలో పొందిన ఇళ్లను ఎలా రద్దు చేస్తారని ప్రశ్నించారు చంద్రబాబు. సంక్రాంతి కల్లా ఇళ్లను పేదలకు స్వాధీనం చేయాలి అని ప్రభుత్వాన్ని చంద్రబాబు డిమాండ్ చేశారు.