కేంద్రం నిధులిస్తే వైఎస్ విగ్రహం పెడతారా?- చంద్రబాబు ఫైర్
posted on Dec 2, 2020 @ 6:02PM
జగన్ అవినీతిపరుడు కాబట్టి అందరిపై అవినీతి ముద్ర వేసేందుకు యత్నిస్తున్నారని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. పోలవరంలో అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నవారు... దాన్ని ఎందుకు నిరూపించలేకపోయారని ఆయన ప్రశ్నించారు. ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రానికి నష్టం చేశారని విమర్శించారు. గతంలో తాము వేసిన అంచనాలను తప్పుపట్టారని... ఇప్పుడు అవే అంచనాలను కరెక్ట్ అంచనాలని చెప్పుకుంటున్నారని టీడీపీ చీఫ్ మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు ఎకరాకు రూ. 10 లక్షల చొప్పున పరిహారం ఎప్పుడు చెల్లిస్తారని వైసీపీ సర్కార్ ను ప్రశ్నించారు చంద్రబాబు.
పోలవరం ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేస్తారో చెప్పకుండా డొంక తిరుగుడుగా మాట్లాడుతున్నారంటూ జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో పోలవరం ప్రాజెక్టును కడుతూ, అక్కడ వైయస్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారా? అని ధ్వజమెత్తారు. వైయస్ విగ్రహం పెడితే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? అని ప్రశ్నించారు. వైయస్ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనతో పోలవరంకు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయని చెప్పారు.గోదావరి నీళ్లను తెలంగాణ మీదుగా శ్రీశైలానికి తెస్తామని జగన్ చెప్పినప్పుడు అది కుదిరే పని కాదని తాను చెప్పానని... తాను చెప్పినట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గే పరిస్థితి వచ్చిందని చెప్పారు. ఈ ప్రశ్నలు అడిగితే తమను శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు.