చంద్రబాబు మాట జారుటేల
posted on Sep 3, 2013 @ 8:02PM
చంద్రబాబు తన ‘ఆత్మగౌరవ యాత్ర’ను మొదలుపెట్టినప్పుడు ఆయనకు సమైక్యవాదులు, వైకాపా మద్దతుదారుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయని అందరూ భయపడ్డారు. కానీ, తెలుగు తమ్ముళ్ళ మధ్య సాగుతున్న ఆయన జోలికి వచ్చేసాహసం ఎవరూ చేయకపోవడంతో అందరూ నిటూర్పు విడిచారు. ఆయనను ఎవరూ ఇబ్బంది పెట్టకపోయినా ఆయన మాత్రం చాలా ఘాటయిన పదాలతో కాంగ్రెస్, వైకాపా,తెరాస నేతలను దుయ్యబట్టడం వివాదాస్పదం అవుతోంది.
కాంగ్రెస్ నేతలని ఆయన కుక్కలని, అవి తనను చూసి మొరుగుతాయే తప్ప సోనియాగాంధీ మొరగవని, ఆమెను చూసి తోకూపుతాయని ఎద్దేవా చేసారు. ఇక బెయిలు కోరుతున్న జగన్, ప్యాకేజి కోరుతున్న కేసీఆర్ సోనియా గాంధీ ధరిస్తున్న చెప్పుల వంటి వారని ఆయన విమర్శించారు. తమతో పెట్టుకొంటే వైకాపా తోక కట్ చేస్తానని హెచ్చరించారు. తెలుగువారి జోలికి వస్తే కబడ్దార్, సింహ గర్జన చేస్తానని ఏవేవో మాటలు చెప్పారు. సోనియా గాంధీకి డబ్బు పిచ్చి పట్టిందని ఆయన ఎద్దేవా చేసారు. కాంగ్రెస్ పార్టీకి సమర్ధంగా రాష్ట్ర విభజన చేయడం చేతకాకపోతే, తనకు అధికారం అప్పగిస్తే తానా పనిని అవలీలగా, ఎంతో సమర్ధంగా, అందదరికీ ఆమోదయోగ్యంగా చేయగలనని చెప్పుకొన్నారు. అంతకంటే ఆ పని ఏవిధంగా చేయవచ్చో కాంగ్రెస్ పార్టీకి చెప్పిపుణ్యం కట్టుకొంటే ప్రజలు కూడా చాలా సంతోషిస్తారు.
తొమ్మిదేళ్ళు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా పాలించిన ఆయనే ఇటువంటి మాటలు మాట్లాడుతుంటే, పార్టీలో మిగిలినవారు కూడా ఆయనను అనుకరించక మానరు. అదేవిధంగా కంటికి కన్ను, పంటికి పన్ను అన్నట్లు ఆయన ఏస్థాయి భాషనుపయోగిస్తే ఆయన విరోధులు కూడా అదే స్థాయిలో జవాబిస్తారనే సంగతి ఆయన గుర్తుంచుకోవడం మేలు. ప్రత్యర్దులను విమర్శించడానికే అయితే ఆయన పనికట్టుకొని బస్సుయాత్ర చేసి ఇంత శ్రమ పడనవసరం లేదు. ఆ పని తన కార్యాలయం నుండి ఇంత కంటే బాగా, తక్కువ శ్రమతో చక్కబెట్టవచ్చును.ఆయన నిర్మాణాత్మకమయిన సలహాలు ఇస్తే ప్రజలు కూడా హరిస్తారు.