తెలుగుదేశంలో రచ్చ!రచ్చ!
posted on Dec 8, 2012 @ 6:47PM
నివురు గప్పిన నిప్పులావున్న తెలుగుదేశంలో అంతర్గత విభేదాలు అవకాశం దొరికినప్పుడల్లా బగ్గుమని బయటపడుతుంటాయి. మొన్నరాజ్యసభ యఫ్.డి.ఐ. వోటింగులో పాల్గొనని ముగ్గురు తెలుగుదేశం యంపీలవల్ల అన్నివైపులనుండీ పార్టీపై విమర్శలు వెల్లువెత్తుతుంటే, పార్టీలోపల ఉన్ననాయకులూ దానిని సమర్ధంగా త్రిప్పికొట్టే బదులు వారుకూడా బయట పార్టీలతో కలిసి కోరస్ పాడుతూ, తమ నేతల మీద తామే దండెత్తుతున్నారు. ఇంతకాలం తెలంగాణాలో తానూ చెమటోడ్చి సాదించిన ఫలితాన్ని ముగ్గురు యంపీలు చిటికలో బూడిదపాలు జేసారని చంద్రబాబు తీవ్రఆవేదన జెందరు. ఆ ముగ్గురినీ రేపు ఆదిలాబాదులో తన పాదయాత్ర జరుపుతున్న ప్రాంతానికి వచ్చి కలవమని ఆదేశించారు.
పార్టీ నాయకుడు చంద్రబాబు ఈ వయసులో అనారోగ్యాన్ని సైతం లెక్క జేయకుండా ఎండనక,చలనకా పాదయాత్రలు చేస్తూ తెలుగుదేశంపార్టీకి ఎలాగయినా పునర్వ్హైభవం తేవాలని కష్ట పడుతుంటే, మరో వైపు పార్టీ నేతలే పార్టీ పరువుని బజారు కీడుస్తున్నారు. తెలుగుదేశంపార్టీలో వివిధ కారణాలతో అసంతృప్తితో ఉన్నతెలంగాణానేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, కడియం శ్రీహరి వంటివారు ఆ ముగ్గురు ఎంపీలు దేవేందర్‌గౌడ్, సుజన చౌదరి, గుండాసుధారాణిలను తీవ్రంగా విమర్శించారు. కీలక సమయంలో సీనియర్ నాయకులమని చెప్పుకు తిరిగే ఆ నేతలకి సభకి వెళ్ళడం యెంత అవసరమో తెలియదా? అని ప్రశ్నించేరు. ఆ పదవికి వారు అనర్హులయినప్పటికీ చంద్రబాబు దయతలచి వార్కి ఆ పదవులు ఇస్తే వారు అందుకు ప్రతిగా ఆయనకే ‘హ్యాండ్’ ఇచ్చేరని ఎద్దేవా చేశారు. అయితే, ఇదంతా వారు ఎంతగా రగిలిపోతున్నారో తెలియజేస్తోంది. టీడీపీ నేత కొత్తకోట దయాకర్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి వారిని వెంటనే రాజీనామా చేయాలనీ డిమాండ్ చేశారు. దీనినిబట్టి చూస్తే ‘దేశం చాల క్లిష్ట పరిస్తితుల్లో ఉన్నట్లు అర్ధమవుతోంది.’ ఒకవైపు బాబు చమటోడుస్తుంటే, తెలుగు తమ్ముళ్ళు తమలో తాము కీచులాడుకొంటూ పార్టీ ఉనికికే ముప్పు తెచ్చేలా ఉన్నారు. చంద్రబాబు ముందుగా పార్టీని చక్కదిద్దుకొని ఆ తరువాత యాత్రలకి బయల్దేరి ఉంటటే బాగుండేదేమో కదా!