Read more!

ఆ పార్టీలను బంగళాఖాతంలో పడేయండి

 

 

చంద్రబాబు పాదయాత్రలో ప్రతి జిల్లాలో లేటెస్ట్ కాన్సెప్ట్ తో దూసుకుపోతున్నారు. స్పీచ్ లతో ప్రజలను బోర్ కొట్టించకుండా, కొత్త ఐడియాలతో ముందుకెళ్తున్నారు. తన భార్య భువనేశ్వరితో కలిసి పాదయాత్ర చేసిన చంద్రబాబు మెదక్ జిల్లాలో ప్రవేశించారు. ప్రజాసమస్యలను పట్టించుకోని కాంగ్రెస్, టీఆర్ఎస్‌లను కూకటి వేళ్లతో పెకలించి బంగాళాఖాతంలో పడేయాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు కోరారు.


దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ దొంగలు తొమ్మిది లక్షల కోట్ల రూపాయలను దోచుకున్నారన్నారు. ప్రభుత్వ భూములను, ఖనిజ సంపదను అమ్ముకుని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చేసి మనం కట్టిన పన్నులను మింగేశారన్నారు. అవినీతికి పాల్పడి జైల్లో ఉన్న పిల్ల కాంగ్రెస్ నేత అక్కడినుంచి రాజకీయం చేస్తూ ఎమ్మెల్యేలను కొంటున్నారని విమర్శించారు. తమపై ఉన్న కేసులను మాఫీ చేస్తే కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు రాయబారాలు నడుపుతున్నరన్నారు.



ఎన్నికలు జరిగే ఒక్కరోజు తన కోసం కేటాయించాలని చంద్రబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అవినీతి నిర్మూలనకు ధర్మాన్ని, విలువలను కాపాడటమే తన ధ్యేయమన్నారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ తప్పూ చేయకుండా నిజాయితీగా ఉంటున్నానన్నారు. తనతో పాటు కుటుంబ సభ్యులందరి ఆస్తుల వివరాలు ప్రకటించే నాయకుడిని దేశంలో తానొక్కడినేనని ఆయన అన్నారు. డబ్బులకు కక్కుర్తి పడి తమ పార్టీ నుంచి వైసీపీలో చేరినవారు.. 2009లో తమ పార్టీ నుంచి ఎందుకు పోటీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.