అలుపెరుగని బహుదూరపు బాటసారులు

 

ఇది పాదయాత్రల సీజను. ‘పాదయాత్ర చేస్తే అధికారంలోకి రావడం ఖాయం’ అనే ఒక కొత్త సిద్దాంతం కనిపెట్టిపోయిన మహానుభావుడు స్వర్గీయ డా.రాజశేఖర్ రెడ్డికి శతకోటి వందనాలంటూ అయన కుమార్తె షర్మిల, అయన బద్ధవిరోధి చంద్రబాబు పాదయాత్రలు మొదలుపెట్టారు. అయితే, ఇద్దరూ పాదయాత్రలు చేస్తున్నారు గనుక, ఇద్దరికీ అధికారం ఎలా దక్కుతుందనేది మిలియన్ డాలర్ ప్రశ్న. కాంగ్రెస్ పార్టీలో ఎవరూ ఇంత కష్టపడి పాదయాత్రలు చేయట్లేదు గనుక ఆ పార్టీ ఓడిపోతుందా? అనే ధర్మసందేహం కూడా మిగిలుంది.

 

వయసు మీదపడి ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ చంద్రబాబు ముందుకు సాగుతుంటే, మోకాలికి శస్త్రచికిత్స చేయించుకొని షర్మిల ముందుకు సాగుతున్నారు. వీరిరువురి పాదయాత్రలో చాలావిషయాలలో సారూప్యత కనిపిస్తుంది.

 

ఒకరు ‘వస్తున్నా మీ కోసం’ అంటే మరొకరు ‘మరో ప్రజా ప్రస్థానం’ అంటున్నారు. ఇద్దరూ కూడా ప్రజల కోసమే వస్తున్నట్లు తెలియజేస్తున్నారన్నమాట.

 

ఇద్దరూ కూడా రాయలసీమలోనే పాదయాత్రలు మొదలుపెట్టారు. (చంద్రబాబు అనంతపురం జిల్లా, హిందూపురం నుండి ఆరంభిస్తే, షర్మిల ఇడుపులపాయ కడప జిల్లా నుండి ఆరంభించారు.)

 

ఇద్దరూ కూడా తెలంగాణాలోనే తమ 1000 కిమీ పాదయాత్ర రికార్డులు సాదించారు. ఇద్దరూ కూడా కాంగ్రెస్ భారినపడి కష్టాలనుభవిస్తున్న ప్రజలను ఒదార్చడానికే పాదయాత్ర చేస్తున్నట్లు చెప్పుకొంటున్నారు. గానీ, వారిద్దరూ కూడా తమ పార్టీలు అధికారంలోకి రావాలనే లక్ష్యంతోనే ప్రజలను ఓట్లేయమని కోరుతున్నారు.

 

ఇద్దరికీ ఉమ్మడి శత్రువు కాంగ్రెస్ పార్టీయే. (అదనంగా ఆ రెండు పార్టీలు ఒకరికొకరు శత్రువులు.)

 

ఇద్దరూ కూడా ఎదుట పార్టీయే కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు అయిందని గట్టిగా చెపుతున్నారు.

 

షర్మిల తమ పార్టీని ఎన్నుకొంటే ‘రాజన్న రాజ్యం’ వస్తుందని చెపుతుంటే, చంద్రబాబు ‘రామరాజ్యం’ వస్తుందని అంటున్నారు.

 

ఇద్దరూ కూడా కాళ్ళ సమస్యల వల్లనే మద్యలో పాదయాత్రలు ఆపవలసి వచ్చింది.

 

బహుశః ఇద్దరూ కూడా రాష్ట్రంలో చిట్టచివరి జిల్లా అయిన శ్రీకాకుళంలోనే తమ పాదయాత్రలను ముగించే అవకాశం ఉంది.