సచివాలయంలో పరిస్థితులపై చంద్రబాబు ఆందోళన
posted on Jul 4, 2014 @ 2:20PM
సచివాలయంలో జే బ్లాకులో మంత్రులు, అధికారుల ఛాంబర్లను ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పరిశీలించారు. సచివాలయ ఉద్యోగుల వసతి ఏర్పాట్లపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడారు. పరిస్థితులు ఎప్పటిలోగా అదుపులోకి వస్తాయే అర్ధం కావట్లేదన్నారు. ఆర్డీవో స్థాయి అధికారికి ఒక బల్ల, నలుగురు ఉద్యోగులను కేటాయించారని తెలిపారు. చాలా ఛాంబర్లకు తాళాలు వేసి ఉండడం అధ్వాన్న పరిస్థితికి అద్దం పడుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
అంతకుముందు చంద్రబాబు ట్యాంక్ బండ్ పైన అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బ్రిటీష్ వారి అరాచక పాలనను వ్యతిరేకించి పోరాడిన గొప్ప స్వాతంత్ర్యోద్యమ వీరుడు అల్లూరి అని కొనియాడారు. విశాఖలో అల్లూరి పేరిట ఓ మెమోరియల్ (స్మారకం) ఏర్పాటు చేస్తామని... అందులో అల్లూరికి చెందిన ఫొటోలు, వివరాలు, విషయాలు అన్నీ ఉంటాయన్నారు. అల్లూరి జయంతిని రాష్ట్ర ఉత్సవంగా జరుపుకుంటామన్నారు. వచ్చే ఏడాది నుంచి అన్ని పాఠశాలల్లో అల్లూరి జయంతిని నిర్వహించేలా చర్యలు తీసుకుంటామన్నారు.