పార్లమెంట్ సాక్షిగా అడ్డంగా బుక్కైన జగన్ రెడ్డి..
posted on Jul 27, 2021 @ 8:00PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులమయంగా మారిందన్నది విపక్షాల ఆరోపణ. జగన్ రెడ్డి సర్కార్ పాలనతో రాష్ట్రం ఇప్పట్లో కోలుకోలేనంతగా ఆర్థిక కష్టాల్లో పడిందని చెబుతున్నారు. ఎడాపెడా అడ్డగోలుగా అప్పులు చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ప్రతినెలా ఉద్యోగాలకు వేతనాలు ఇవ్వాలన్న అప్పు తేవాల్సిన దారుణ స్థితిలో పడిపోయింది. ఆర్థిక రంగ నిపుణులు కూడా ఏపీ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇంతటి దారుణ పరిస్థితులు ఉన్నా సీఎం జగన్ తో పాటు మంత్రులు మాత్రం అంతా బాగానే ఉందని కవర్ చేసుకుంటున్నారు. పరిమితికి లోబడే రుణాలు తీసుకున్నామని, అన్ని రాష్ట్రాల్లాగే తాము ముందుకెళ్లామని చెబుతున్నారు. అయితే తాజాగా జగన్ రెడ్డి సర్కార్ బండారం పార్లమెంట్ సాక్షిగా బయటపడింది. వైసీపీ నేతల నోళ్లకు మూత పడింది.
అప్పుల కుప్పగా ఆంధ్రప్రదేశ్ మారిందిని పార్లమెంట్‌లో కేంద్రం స్పష్టం చేసింది. ఆదాయానికి మించి అప్పులు చేయడంలో ఏపీ అగ్రభాగాన ఉందని వెల్లడించింది. రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా పార్లమెంటు సాక్షిగా ఏపీకి కేంద్ర ఆర్థికశాఖ అక్షింతలు వేసింది. 2020-21 సంవత్సరానికి రు.54,369.18 కోట్ల ఆర్థిక లోటు ఉందని రాష్ట్ర ప్రభుత్వమే ఒప్పుకుందని కేంద్రం తెలియజేసింది.
15వ ఆర్ధిక సంఘం అనుమతి మేరకు 2020-21 ఆర్ధిక సంవత్సరానికి రూ. 30,305 కోట్ల అప్పునకు అనుమతి కోరిందని కేంద్రం తెలిపింది. కొవిడ్ కారణంగా మరో రూ.19,192 కోట్ల అప్పునకు అనుమతిచ్చినట్లు కేంద్ర ఆర్థికశాఖ తెలిపింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ. 49,497 కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు అనుమతులు ఇచ్చామని పేర్కొంది. అయితే పరిమితికి మించి ఏపీ రూ.4,872 కోట్ల అప్పు చేసినట్లు కేంద్రం వెల్లడించింది.
అప్పుల విషయంలోనే కాదు జగన్ ప్రభుత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్న దిశ చట్టం విషయంలోనూ బండారం బహిర్గతమైంది. ఏపీలోని మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ బిల్లుపై తమ అభ్యంతరాలకు ఏపీ ప్రభుత్వం నుంచి తిరిగి స్పందన రాలేదని లోక్‌సభలో హోంశాఖ తెలిపింది. లోక్‌సభలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌కుమార్ మిశ్రా సమాధానం ఇచ్చారు. రాష్ట్రం పంపిన దిశ బిల్లుపై తమ అభ్యంతరాలను హోంశాఖ మంత్రిత్వశాఖ లేవనెత్తింది. దీంతో పలు అంశాలపై వివరణ కోరినట్లు హోంశాఖ పేర్కొంది. తాము లేవనెత్తిన అభ్యంతరాలకు, వివరణలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి తెలిపారు.