మోదీ సర్కార్ ముద్దుబిడ్డ జగన్!?
posted on Feb 16, 2023 5:58AM
అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో .. ఇది చాలా పాత సామెత. అయితే, రాజ్యాంగ వ్యవస్థలు కూడా అలాగే వ్యవహరిస్తాయా? కేంద్ర ప్రభుత్వానికి అణిగి మణిగి, ప్రధాని మోదీ ఇతర కేంద్ర పెద్దల అడుగులకు మడుగులొత్తే ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల విషయంలో ఒకలా ఇతర రాష్ట్రాల విషయంలో మరోలా రాజ్యాంగ వ్యవస్థలు వ్యవహరిస్తాయా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డుపెట్టి కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘం మొకాలడ్డింది. కానీ, పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోనూ మండలి ఎన్నికల షెడ్యూలు విడుదలైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కడప ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపనకు(అది కూడా నాలుగో సారి) మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఇది రాష్ట్రాల మధ్య వివక్ష కాదా, అని తలసాని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.
అవును సచివాలయం ప్రారంభోత్సవానికి అడ్డుపడిన కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై మంత్రి తలసాని తమ సహజ ధోరణిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ కడపలో ఉక్కు కర్మాగారానికి బుధవారం (ఫిబ్రవరి 15) శంకు స్థాపన చేశారు. అందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కానీ, తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి మాత్రం ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు. నిజానికి, కడప జిల్లాలో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉందని.. అలాంటప్పుడు అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వనికి అనుమతి ఇవ్వడాన్ని తాము తప్పు పట్టడం లేదని, రాజ్యాంగ వ్యవస్థలు ఎలా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయో తెలిపేందుకు ఇదొక ఉదహరణ మాత్రమే తలసాని చిన్నపాటి వివరణ కూడా ఇచ్చారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ ప్రారంభోత్సవాన్ని ఈ నెల 17 చేపట్టాలని భావించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో వచ్చింది. రాష్ట్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. అదే విధంగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకటించింది. గురువారం (ఫిబ్రవరి 16) నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 13న ఎన్నికలు జరుగన్నాయి. మార్చి 16న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నూతన సచివాలయ ప్రారంభోత్స తేదీని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ఈసీని అనుమతి కోరింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 17న జరగాల్సిన నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే తాజాగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కూడా ఏపీ సీఎం జగన్ కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం.. అందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్న బీఆర్ఎస్.. ఎన్నికల సంఘం ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది.
నిజమే, ఈ ఒక్క విషయంలోనే కాదు, అడ్డగోలు అప్పులకు అనుమతి ఇచ్చే విషయంలో అయితే నేమీ, కోర్టు కేసుల విషయంలో వెసులుబాటు కల్పించే విషయంలో అయితే నేమీ, ప్రధాని ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ విషయంలో అయితే నేమి, ఇతరత్రా వ్యవహారాల విషయంలో అయితే నేమీ, కేంద్ర ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రుల కంటే కొంచెం ఎక్కువగా చూస్తోందనేది నిజం. అయితే అందుకు కారణం కూడా లేక పోలేదు. కేసేఆర్ లేదా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాగా జగన్ రెడ్డి కేంద్రం కట్టు దాటడం లేదు. అసలు కేంద్రాన్ని పల్లెత్తు మాటైనా అనని ‘మంచి’ ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్నారు. పాదాభివందనాలు, సాష్టాంగ సంస్కారాల, వంగి వంగి దండాలు పెట్టే విషయంలో ఆయన ఏ మాత్రం భేషజాలు పోరు.
సో... కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం పట్ల ప్రత్యేక ప్రేమ చూపుతోంది అనుకోవచ్చు. అయితే, ఎన్నికల సంఘం వంటి రాజ్యంగ వ్యవస్థలు కూడా ఇలా జీ హుజూర్. అనవచ్చునా...?