అమరావతిలో ఇళ్ల నిర్మాణానికి ఒకే.. కేంద్రం తీరే వేరులే!
posted on Jun 27, 2023 @ 3:50PM
ఏపీ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ స్టాండ్ క్లియర్ కట్ గా ఉంటుంది. రాజధానిగా అమరావతి ఉండేందుకు ఆ పార్టీ అధినేత, సీఎం జగన్ మోహన్ రెడ్డికి సుతరామూ ఇష్టం లేదు. సీఎంగా జగన్ మోహన్ రెడ్డి అమరావతిని అభివృద్ధి చేసినా రాజధాని క్రెడిట్ మాత్రం పునాది రాయి వేసిన చంద్రబాబుకే దక్కుతుంది. ముందు ముందు తరాలు అమరావతి చరిత్ర తీస్తే ముందు పేరు చంద్రబాబుదే వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డికి అసలు ఇష్టం లేదు. అందుకే సవాలక్ష కారణాలు చెప్పి అమరావతిని నాశనం చేస్తున్నారు. వైసీపీ నేతలు సైతం అమరావతి రాజధానిగా ఒప్పుకునే పరిస్థితిలో లేరు. కోర్టులు ఎన్నిసార్లు చెప్పినా.. అమరావతి రైతులు తమ బాధ ఎన్ని రకాలుగా విన్నవించుకున్నా దున్నపోతు మీద వాన మాదిరి ప్రభుత్వంలో అసలు చలనమే లేదు.
అయితే ఏపీ రాజధానిగా అమరావతి అంశంపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ స్టాండ్ ఏంటన్నది మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఒకవైపు రాజధానిగా అమరావతే ఉండాలని.. అది కూడా ఏకైక రాజధాని అమరావతి మాత్రమే అంటూ బీజేపీ నేతలు ఘంటాపదంగా చెప్తారు. కానీ, అమరావతిని నాశనం చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ఎలాంటి అనుమతి కోరినా కేంద్ర ప్రభుత్వం అడిగిన వెంటనే చేసేస్తారు. మా స్టాండ్, మా ఓటు అమరావతికి అంటూనే.. రాజధాని అమరావతి కాకుండా చేసేందుకు ఏపీ ప్రభుత్వానికి సాయం చేస్తారు. దీంతో బీజేపీ ప్రభుత్వం ఆడే ఈ డబుల్ గేమ్ రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకి దారితీస్తున్నది. ఇప్పటికే పలుమార్పు బీజేపీ ఇలాంటి డబుల్ గేమ్ ఆడుతూ ఏపీ ప్రజలలో చులకన కాగా.. ఇప్పుడు అలాంటిదే మరోసారి తెరమీదకి వచ్చింది.
రాజధాని అమరావతిని చంద్రబాబు తరతరాలకు సంపద సృష్టించే వరల్డ్ క్లాస్ సిటీగా నిర్మించాలనుకుని ఇప్పటికే అక్కడ అందుకు తగిన ప్రాథమిక సౌకర్యాల కల్పన కూడా చేశారు. అయితే జగన్ సర్కార్ ఇప్పుడు అక్కడ పరిపాలనా భవనాలను కాకుండా నివాస గృహాలను నిర్మించాలని, అది కూడా రాజధానేతర ప్రాంతాల వారికి ఇళ్లను నిర్మించాలని భావిస్తున్నది. ముందుగా ఆర్ 5 జోన్ లో ఈ ఇళ్లకు స్థలాల పట్టాలు ఇస్తూ జీవో కూడా జారీచేసింది. అయితే ప్రస్తుతం ఈ అనుమతుల వ్యవహారం హైకోర్టు పరిధిలో ఉండగా ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకూ వెళ్ళింది. జగన్ ప్రభుత్వం ఇచ్చే పట్టాలు హైకోర్టు తుది తీర్పునకు లోబడి ఉంటుందని.. తీర్పు వ్యతిరేకంగా వస్తే ప్రత్యేక ప్రయోజనాలు కోరే హక్కు లబ్థిదారులకు ఉండదని కూడా సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
అయితే కోర్టు పరిధిలో ఉన్న ఈ గృహాల నిర్మాణ వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కేంద్రాన్ని అనుమతి కోరగా.. కేంద్రం కూడా రాష్ట్రం అడిగిన వెంటనే అనుమతులు ఇచ్చేసింది. ఆర్ 5 జోన్ లో కట్టాలని భావిస్తున్న 47 వేల ఇళ్లకు కేంద్రంలోని సెంట్రల్ శాంక్షనింగ్ అండ్ మానిటరింగ్ కమిటీ భేటీలో అనుమతులు ఇస్తూ నిర్ణయాన్ని తీసుకున్నారు. అమరావతిలో ఇప్పటికే రాజధానేతరులైన 50793 మందికి ఇళ్ల పట్టాల్ని పంపిణీ చేయగా.. వీరిలో 47 వేల మందికి కేంద్రం ఇళ్లు మంజూరుకి అనుమతిచ్చింది.
మిగిలిన ఇళ్ల నిర్మాణానికి కూడా తదుపరి సమావేశంలో అనుమతులు ఇస్తామని పేర్కొంది. కేంద్రం నుంచి అనుమతులు లభించడంతో ఏపీ ప్రభుత్వం జులై 8న గృహ నిర్మాణాలకు శ్రీకారం చుట్టనుంది. ఈ మొత్తం వ్యవహరాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం నెల వ్యవధిలోనే పూర్తి చేయటం ఆసక్తికరం. మరి రాజధాని అంశంలో వైఖరి ఏంటో బీజేపి ఇప్పటికైనా స్పష్టంగా చెప్పాలని అమరావతి ప్రాంత వాసులు కోరుతున్నారు.