అమరావతిలో చంద్రబాబు సొంత ఇల్లు.. ఏప్రిల్ 9న శంకుస్థాపన
posted on Mar 29, 2025 @ 12:11PM
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అమరావతిలో సొంత ఇల్లు నిర్మించుకోనున్నారు. ఇందు కోసం ఆయన వెలగపూడిలో ఐదు ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఈ6 రోడ్డుకు ఆనుకుని ఉండే ఈ స్థలానికి నాలుగువైపులా రోడ్డు ఉంది. అంతే కాకుండా అమరావతిలో కీలకమైన సీడ్ యాక్సెస్ మార్గానికి చేరువగా ఉంది. హైకోర్ట్, విట్, గవర్నమెంట్ కాంప్లెక్స్, గెజిటెడ్ ఆఫీసర్స్, ఎన్జీవోల నివాససముదాయాలు చంద్రబాబు కొనుగోలు చేసిన స్థలానికి కేవలం రెండు కీలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి.
ఐదు ఎకరాల స్థలంలో ఇంటిట నిర్మాణంతో పాటు ఉద్యానవనం, సెక్యూరిటీ సిబ్బందికి గదులు, వాహనాల పార్కింగ్ వంటి వాటికి వినియోగించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇక సాధ్యమైనంత త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమరావతి పునర్నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభం కావడానికి ముందే ఇంటి నిర్మాణానికి చంద్రబాబు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ రానున్న సంగతి తెలిసిందే. ఆ లోపుగానే తన సొంత ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేయాలని భావిస్తున్న చంద్రబాబు అందుకు ఏప్రిల్ 9 ముహూర్తంగా నిర్ణయించారు.