వైసీపీ ఎంపీ రఘురామరాజుపై సీబీఐ కేసు నమోదు..
posted on Oct 9, 2020 @ 10:26AM
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు, ఆయన భార్య రమాదేవిపై తాజాగా సీబీఐ కేసు నమోదు చేసింది. ఎంపీ రఘురామరాజుకు చెందిన ఇండ్- భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ సంస్థ కు సంబంధించిన విషయంలో వీరితో పాటు మరో 9 మంది డైరెక్టర్ల పై కూడా సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కంపెనీకి రుణం ఇచ్చిన బ్యాంకుల తరఫున పంజాబ్ నేషనల్ బ్యాంక్ చీఫ్ మేనేజర్ సౌరబ్ మల్హోత్రా మొన్న మార్చి నెల 21వ తేదీన ఫిర్యాదు చేసారు. ఆ ఫిర్యాదు ఆధారంగా గత మంగళవారం సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు నిన్న హైదరాబాదు, ముంబై నగరాల్లోనూ, ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం 11 చోట్ల సోదాలు నిర్వహించారు.
ఎఫ్ఐఆర్ లోని వివరాల ప్రకారం.. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునైటెడ్ బ్యాంకులు కలిసి ఎంపీకి చెందిన ఇండ్ - భారత్ సంస్థకు మొదట రూ.941.80 కోట్లు, దానికి అనుబంధం రూ.62.80 కోట్లు కోట్లు మంజూరు చేశాయి. ఇండ్- భారత్ సంస్థ మొదట కర్ణాటకలో ఒక పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేసింది. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో దాన్ని తమిళనాడులోని ట్యూటికోరిన్ కు మార్చింది. అయితే సంస్థ ఏర్పాటైనప్పటి నుండి వివిధ పద్ధతుల్లో దీనికి సంబంధించిన నిధులు మళ్లించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండా విద్యుదుత్పత్తి కోసం కొనుగోలు చేసిన బొగ్గు విషయంలో కూడా మాయ చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనికి సంబంధించి సరైన రికార్డులు కూడా కంపెనీ వద్ద లేవు. దీంతో కంపెనీ లావాదేవీల్లో అవకతవకలపై బ్యాంకులు ఎప్పుడు ప్రస్తావించినా ఏ మాత్రం మార్పు రాలేదు. దీంతో సంస్థను నిరర్ధక ఆస్తుల జాబితాలో చేర్చారు. నిందితులంతా కలిసి తమ ప్రయోజనం కోసం ప్రయత్నించి రూ.826.17 కోట్ల నష్టం కలిగించారు దానిపై ఐపీసీతో పాటు అవినీతి నిరోధక చట్టం కింద సైతం కేసులు నమోదు చేశారు.