Read more!

అందుకే సబితకు టికెట్ ఇవ్వలేదా?

 

జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో చార్జ్ షీట్లో పేరెక్కినందుకు తన హోంమంత్రి పదవిని కోల్పోయిన సబితా ఇంద్రారెడ్డి, కనీసం ఈ ఎన్నికలలో పోటీ చేసేందుకు పార్టీ టికెట్ ఇస్తుందని ఆశించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం ఆమెకు టికెట్ ఇవ్వలేదు గానీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న ఆమె కొడుకు కార్తిక్ రెడ్డికి చేవెళ్ళ నుండి లోక్ సభకు పోటీ చేసేందుకు టికెట్ ఇచ్చింది.

 

దానికే ఆమె తృప్తి పడినప్పటికీ, ఆమెకు ఆ సంతోషం కూడా మిగలనీయకుండా సీబీఐ ఓబులాపురం గనుల వ్యవహారంలో ఆమెపై మరో సరికొత్త అభియోగం మోపి ఆమెను నిందితురాలిగా పేర్కొంటూ మరో చార్జ్ షీటు సిద్దం చేస్తోంది. ఆమెపై ఐ.పీ.సి. సెక్షన్స్120 (బి) రెడ్ విత్ 420, 472, 468, 447, 409 మరియు అవినీతి నిరోధక చట్టం-1998లో సెక్షన్స్13(2) రెడ్ విత్ 13(1)(డీ) అభియోగాలు మోపుతూ సీబీఐ చార్జ్ షీట్ సిద్దం చేసి ఈ మేరకు నాంపల్లి సీబీఐ కోర్టులో మెమో దాఖలు చేసింది.

 

బహుశః కాంగ్రెస్ అధిష్టానానికి చాలా కాలం క్రితమే ఈ విష్యం తెలిసి ఉండిఉండవచ్చును. బహుశః అందువల్లే సబితకు టికెట్ నిరాకరించి ఆమె కొడుకుకి మాత్రమె ఇచ్చి ఉండవచ్చును. ఈ ఎన్నికలలో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, కేంద్రంలో కూడా ఓడిపోయినట్లయితే, సీబీఐ, ఈడీ తదితర సంస్థలన్నీ అటకేక్కించేసిన ఈ అక్రమాస్తుల, గనుల కేసులన్నిటినీ మళ్ళీ దుమ్ము దులుపి బయటకు తీస్తారేమో!