ఏపీలో కులగణన.. అనుమానాలెన్నో.. తీర్చే దిక్కెవరు?
posted on Nov 20, 2023 @ 9:55AM
ఏపీ సర్కార్ తీసుకున్న కులగణన నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. దేశవ్యాప్తంగా కుల గణనపై విస్తృతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ ముందే ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతుండడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ఏ కులంలో ఎంత మంది ఉన్నారు? అందులో మగవారు ఎంతమంది.. ఆడవారు ఎంతమంది?, మళ్ళీ అందులో పిల్లలు ఎంతమంది? వారి వయస్సు, వారి ఆర్ధిక పరిస్థితి, ఇళ్ల నెంబర్లు, ఉద్యోగం, వ్యాపారం, ఉపాధీ, సెల్ నెంబర్లు, ఆధార్ నెంబర్లు ఇలా సమస్త సమాచారం సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అంతేకాదు తప్పనిసరిగా ప్రస్తుత చిరునామా పొందుపరచడంతో పాటు.. అది సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా, అది కాకుండా నివాస స్థలం ఉందా, ఇంట్లో మరుగుదొడ్డి సౌకర్యం ఉందా? తాగునీటి సదుపాయం ఉందా? వీధి కుళాయి, బోర్ వెల్, పబ్లిక్ బోర్వెల్, సొంత కుళాయి ఉందా? గ్యాస్ పొయ్యి ఉందా? లేకుంటే కట్టెల పొయ్యితోనే వండుతున్నారా? పశు సంపద కలిగి ఉన్నారా? ఉంటే ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు ఎన్ని ఉన్నాయి? ఇలా కుటుంబ సభ్యుల సమగ్ర వివరాలతో పాటు వ్యవసాయ భూమి వివరాలను నమోదు చేయనున్నారట.
ఈనెల 27 నుంచి ఈ కుల గణన ప్రారంభం కానుండగా.. 2024 ఎన్నిక సమయానికి ఇది పూర్తి చేయాలని జగన్ సర్కార్ భావిస్తుంది. అంటే ఎన్నికల సమయానికి ప్రతి ఒక్కరి సమస్త సమాచారం ప్రభుత్వం చేతిలో ఉండేలా ఈ కులగణన చేపట్టేందుకు కసరత్తులు చేస్తున్నది. ముందుగా ఈ కులగణనను పూర్తిగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా చేపట్టడానికి ఏపీ సర్కార్ నిర్ణయించింది. కానీ, ఆ తర్వాత ఏమనుకుందో, రాజకీయ విబేధాలు వస్తాయని భావించిందో ఏమో వలంటీర్లను పక్కనపెట్టి రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖ, ప్లానింగ్, సంక్షేమ శాఖ నుంచి ఎంపిక చేసిన సూపర్వైజర్ల పర్యవేక్షణలో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో ఈ సర్వేను చేపట్టాలని సిద్దపడింది. మండల స్థాయిలో తహసీల్దారులు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు, మండల ప్రత్యేక అధికారుల సైతం ఈ గణనను పర్యవేక్షించనున్నారు.
ఈ కులగణన కోసం ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్ ను కూడా తీసుకురానున్న ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగులు ఇంటింటికి వెళ్లి ఈ యాప్ లో ప్రజల వివరాలతో కుల గణన చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు. సర్వే సమయంలో ప్రతి వ్యక్తి వివరాలను నమోదు చేయడంతో పాటు కేవైసీని కూడా తీసుకోవాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. దీంతో అసలు ఈ కులగణన జరిగే పనేనా? ప్రభుత్వం చెప్పిన వివరాల ప్రకారం రాష్ట్ర ప్రజల సమాచారం మొత్తం తీసుకోవాలంటే అసలు సమయం సరిపోతుందా? సచివాలయ ఉద్యోగులు వెళ్లి ఇలా సమస్త సమాచారం అడిగితే ప్రజలు చెప్తారా? అసలే ప్రభుత్వం మీద ఆక్రోశంతో ఉన్న జనం ఈ సర్వేకి సహకరిస్తారా? అసలు ఇంత ప్రయాసలకోర్చి ఇప్పటికిప్పుడు ఏపీ ప్రభుత్వం ఈ సర్వే చేపట్టాల్సిన అవసరం ఏంటి ? ఇంత సమాచారం ప్రభుత్వం దేని కోసం సేకరిస్తున్నది? ఇలా సేకరించిన సమాచారం ఎక్కడ భద్రపరచనుంది? ప్రజల నుండి ఇలా సేకరించిన సమస్త సమాచారం భద్రంగానే ఉంటుందా? భద్రంగా ఉంటుందని ప్రభుత్వం హామీ ఇస్తుందా? ఇలా ఎన్నో అనుమానాలు ప్రజల నుండి వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం చెప్తున్న ప్రకారం ఈ సర్వే పూర్తి చేయాలంటే కనీసం ఒకటి రెండేళ్లు సమయం కావాలి. కానీ, ఈ ప్రభుత్వం వద్ద నాలుగు నెలల సమయం మాత్రమే ఉంది. పైగా ఎన్నికల ముంగిట ఇలాంటి సర్వేకి ప్రజలు ఎంతవరకు సహరిస్తారన్నది అనుమానమే. అసలు ఎందుకు ఈ సర్వే చేస్తున్నారో చెప్పకుండా వివరాలు చెప్పమంటే ప్రజలు చెబుతారా? క్షేత్రస్థాయిలో సచివాలయ ఉద్యోగుల పనితీరు సరిగా లేని చోట ఈ సర్వే కష్టమే అవుతుంది. పైగా ప్రభుత్వంపై అసంతృప్తి ఉన్న వారు, ప్రభుత్వంపై అనుమానాలు ఉన్న వారు కేవైసీ చేయడం, ఓటీపీలు చెప్పేందుకు ససేమీరా అనడం గ్యారంటీ. విద్యార్థులు, ఉద్యోగులు ఇంత సమాచారం ఎందుకని ప్రశ్నించడం గ్యారంటీ. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ప్రజల డేటాను సేకరించి హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ సంస్థ ఆఫీసులో స్టోర్ చేస్తున్నదన్న ప్రతిపక్షాల ఆరోపణల నేపథ్యంలో.. ఇప్పుడు ఈ స్థాయిలో ప్రజల నుంచి వారి వివరాలను సేకరించడం, , నాలుగు నెలల్లో కులగణనను పూర్తి చేయడం అసాధ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.