కులం 'సాక్షి'గా.. వార్తల వక్రీకరణే జర్నలిజమా?
posted on Feb 25, 2021 @ 4:35PM
ఏపీలో జగన్ రెడ్డి ప్రభుత్వం. ఆయన కనుసన్నల్లోని సొంత మీడియా. రెండూ కలిసి రెచ్చిపోతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రాన్ని కులాల వారీగా విభజించి.. కుతంత్రాలు అమలు చేస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కే 'కమ్మ' కులం ఆపాదించి విమర్శించిన ఘనత ముఖ్యమంత్రిది. ఆ సమయంలో సీఎం జగన్ మాట్లాడిన తీరును అన్ని వర్గాల ప్రజలు అసహ్యించుకున్నారు. రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న వ్యక్తిపై కులం ముద్ర వేసి అవమానించడమేంటని మండిపడ్డారు. కట్ చేస్తే.. ఆనాడు నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటించినట్టే ఏపీలో పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగాయి. ఇంత దానికి కులం పేరుతో అంత పెద్ద అభాండం వేసి అబాసుపాలవడం జగన్ రెడ్డికే చెల్లింది అంటున్నారు. సీఎం తీరుకు తగుదునమ్మా అంటూ సాక్షి మీడియా మరింత ఓవరాక్షన్ చేస్తుంటుందని చెబుతున్నారు. వరుస ఘటనలపై సాక్షిలో వస్తున్న వార్తలు చూస్తుంటే.. జర్నలిజం విలువలను సాక్షి మీడియా మంట గలుపుతోందని అనిపిస్తోంది.
ఇటీవల గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఓ ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. డిగ్రీ విద్యార్థి అనూషను ప్రేమించిన విష్ణువర్ధన్ రెడ్డి.. ఆమెపై అనుమానం పెంచుకొని గొంతు నులిమి చంపేశాడు. ఈ హత్య ఆంధ్రప్రదేశ్ లో సంచలనంగా మారింది. కలకలం రేపిన ఈ వార్తను అన్ని మీడియా హౌజ్ లూ ప్రముఖంగా ప్రస్తావించాయి. సాక్షి పేపర్ లోనూ ఆ న్యూస్ వచ్చింది. కానీ, నిందితుడి పేరులో 'రెడ్డి' ఎగిరిపోయింది. అనూషను చంపింది విష్ణువర్ధన్ అని ఫోటోతో సహా వేశారు. అతను రెడ్డి అనే విషయాన్ని కావాలనే మరుగున పరిచారు. వార్త మొత్తంలో ఎక్కడా రెడ్డి అనే పదం రాకుండా.. అతి జాగ్రత్తగా న్యూస్ రాసుకొచ్చారు.
సాక్షి మీడియా కులం విషయంలో సంయమనం పాటించింది అనుకోడానికి లేదు. ఎందుకంటే.. ఒక 'రెడ్డి' విషయంలోనే ఇలా చేస్తోంది అనేది ఆరోపణ. అదే 'కమ్మ' కులానికి వచ్చే సరికి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టి వార్తలు రాస్తోందని.. ఆ వర్గానికి చెందిన వారు మండిపడుతున్నారు. 'చౌదరి' పదాన్ని పదే పదే ప్రస్తావిస్తూ ఆ కులం పేరును బజారుకు ఈడ్చే ప్రయత్నం పని గట్టుకు మరీ చేస్తోందని అంటున్నారు.
రమేశ్ హాస్పిటల్స్. విజయవాడలో చాలా మంచి పేరున్న ప్రముఖ హాస్పిటల్. ఎంతో మందికి ప్రాణం పోసిన ఆసుపత్రి. కరోనా సమయంలో జరిగిన అగ్రిప్రమాదం ఆ హాస్పిటల్ చరిత్రకు మాయని మచ్చ. ఆ సమయంలో సాక్షి మీడియా రమేశ్ హాస్పిటల్స్ ఇమేజ్ ను ఎంత డ్యామేజ్ చేయాలో అంతకంటే ఎక్కువే పరువు తీసింది. డాక్టర్ రమేశ్ పేరులో లేని 'చౌదరి'ని బలవంతంగా చేర్చింది. రమేశ్ చౌదరి అంటూ పదే పదే వార్తలు రాస్తూ అగ్నిప్రమాదం ఘటనను కూడా కమ్మ కులానికి ముడిపెట్టే ప్రయత్నం గట్టిగా చేసిందని అంటున్నారు. శవాలతో కుల రాజకీయం చేయడమంటే ఇదేనంటూ అప్పట్లోనే 'సాక్షి'పై విమర్శలు వెల్లువెత్తాయి.
నెగటివ్ వార్తల్లో 'రెడ్డి' ఉంటే ఆ పేరును కట్ చేయడం.. 'కమ్మ' ఉంటే కావాలని మరింతగా ప్రచారం చేయడం 'సాక్షి'కి అలవాటుగా మారిందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదేం దిక్కుమాలిన జర్నలిజం అంటూ అసలైన జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు. కులాల పేరుతో విభజించు-పాలించు సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్న జగన్ సర్కారు, జగన్ మీడియాపై మండిపడుతున్నారు. 'సాక్షి' పేరెత్తితేనే అసహ్యించుకునే పరిస్థితి వస్తోందని అంటున్నారు. తప్పు ఎవరు చేసినా తప్పే. రెడ్డి చేస్తే తక్కువ తప్పు. కమ్మ చేస్తే పెద్ద తప్పు అవదు. కులాన్ని బట్టి జడ్జిమెంట్ మారదు. మారకూడదు. ఆంతేగానీ నిందితుడి కులాన్ని బట్టి ఆ నేరాన్ని ఆ మొత్తం కులంపై నెట్టివేసే దరిద్రపుగొట్టు ప్రయత్నం ఏమాత్రం మంచిది కాదనే అభిప్రాయం అన్ని వర్గాల నుంచి వస్తోంది. కులం పేరుతో వార్తల ప్రాధాన్యత నిర్ణయించడం సరైంది కాదని.. అది పత్రికా విలువలకు పెను ముప్పు అవుతుందంటున్నారు. ఈ విషయం జగన్ మీడియా గుర్తుంచుకుంటే మంచిదని చెబుతున్నారు. ఇకనైనా కులం ప్రస్తావనతో వార్తల ప్రయారిటీ మార్చడం మానుకోవాలని నిజమైన జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు.