తెలంగాణలో క్యాంపు రాజకీయాలు... అభ్యర్ధులను కాపాడుకునేందుకు తిప్పలు...
posted on Jan 25, 2020 9:08AM
తెలంగాణలో మున్సిపల్ క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. ఎవరు ఎప్పుడు చేజారతారోనని భయంతో వణికిపోతున్న ప్రధాన పార్టీలు ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నాయి. తమతమ అభ్యర్ధులను కాపాడుకునేందుకు క్యాంపులు నిర్వహిస్తున్నాయి. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు తమతమ అభ్యర్ధులను క్యాంపులకు తరలిస్తున్నారు. ఏ ఒక్కరూ చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లక్షల్లో ఆఫర్లు వస్తుండటంతో అభ్యర్ధులను కాపాడుకోవడానికి ప్రధాన పార్టీలు ఖర్చుకు సైతం వెనుకాడటం లేదనే ప్రచారం జరుగుతోంది.
సొంతంగా మెజారిటీ రాని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్.... ఆయా ప్రాంతాల్లో మేయర్ అండ్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. ఇక, హైకమాండ్ ఆదేశాలతో అభ్యర్ధులను ఇప్పటికే క్యాంపులకు తరలించిన టీఆర్ఎస్ ముఖ్యనేతలు.... రెబల్స్, ఇండిపెండెంట్స్‌ను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏదిఏమైనాసరే మొత్తం కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురువేయాలన్న కృతనిశ్చయంతో ముందుకెళ్తోన్న టీఆర్ఎస్ అధిష్టానం... పార్టీ లీడర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు.
ఇక, కాంగ్రెస్ కూడా మున్సిపోల్స్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేయడంతో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తోంది. పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నువ్వానేనా అన్నంతగా హోరాహోరీగా పోటీ జరగడంతో... అభ్యర్ధులు చేజారిపోకుండా... ఎక్కడికక్కడ క్యాంపులను నిర్వహిస్తూ అభ్యర్ధులను తరలిస్తున్నారు. అలాగే, బీజేపీ కూడా, తమ అభ్యర్ధులు జారిపోకుండా...జాగ్రత్తలు తీసుకుంటోంది.
ప్రధాన పార్టీలన్నీ మున్సిపోల్స్‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో తమతమ అభ్యర్ధులు చేజారిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ క్యాంపు రాజకీయాలు నడుపుతున్నాయి. మేయర్, ఛైర్మన్ ఎన్నిక రోజు క్యాంపుల నుంచి నేరుగా ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.