మార్పుల వల్లే కాళేశ్వరం ఖర్చు పెరిగింది: కాగ్ రిపోర్ట్
posted on Feb 15, 2024 @ 1:09PM
దేశంలో కెల్లా భారీ నీటిపారుదలా ప్రాజెక్టు కాళేశ్వరం. కెసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించిన ఈ ప్రాజెక్టు వల్లే ఆయన కొంపముంచింది. పదేళ్లు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్వీళూరినప్పటికీ సరిగ్గా ఎన్నికలకు కొన్ని రోజులముందే కాళేశ్వరం ప్రాజెక్టులో కుదుపు రావడం కెసీఆర్ ప్రభుత్వం కూలిపోవడానికి దారి తీసింది. కెసీఆర్ ప్రభుత్వం కుప్పకూడటానికి ప్రధాన కారణాల్లో ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు.
కాళేశ్వరం ప్రాజెక్టులో రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా ఖర్చు పెరిగింది తప్ప అదనంగా ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని కాగ్ వెల్లడించింది. మార్పుల వల్ల గతంలో చేసిన కొన్ని పనులు నిరర్థకంగా మారాయని తెలిపింది. దీంతో రూ.765 కోట్లు నష్టం వాటిల్లిందని తన రిపోర్టులో వెల్లడించింది. కాళేశ్వరం ప్రాజెక్టు మూడో టీఎంసీ పనులను అనవసరంగా చేపట్టినట్లు అయిందని, దీనికి అదనంగా రూ.25 వేల కోట్లు ఖర్చయిందని తెలిపింది. ఈ మేరకు ప్రభుత్వం గురువారం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది.
డీపీఆర్ ఆమోదానికి ముందే రూ.25 వేల కోట్ల విలువైన 17 పనులను నీటిపారుదల శాఖ కాంట్రాక్టర్లకు అప్పగించిందని కాగ్ ఆరోపించింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల సాగునీటిపై మూలధన వ్యయం ఎకరా ఒక్కింటికి రూ.6.42 లక్షలు ఖర్చవుతోందని తన నివేదికలో పేర్కొంది. ప్రాజెక్టు ప్రయోజనాలు, ప్రాజెక్టుకు అయిన వ్యయం నిష్పత్తి 1:51 గా అంచనా వేశారు. కానీ ఈ నిష్పత్తి 0:75 శాతంగా ఉంది. ఇది మరింత తగ్గే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు, మల్లన్న సాగర్ నిర్మాణానికి ముందు భూకంప సంబంధిత అధ్యయనం సమగ్రంగా నిర్వహించలేదని కాగ్ తన రిపోర్టులో పేర్కొంది.