త్వరలో మరో ప్రాంతీయవాద పార్టీ
posted on Apr 22, 2013 @ 2:17PM
తెరాస సృష్టించిన ప్రాంతీయ విబేదాలతో సాంకేతికంగా ఇంకా రాష్ట్రం చీలకపోయిన ప్రజలు మాత్రం ఎప్పుడో చీలిపోయారు. తెరాస చేస్తున్న ఉద్యమాల ప్రభావం కేవలం తెలంగాణ జిల్లాల మీదనే కాక యావత్ రాష్ట్రoపై, రాష్ట్రంలో అన్ని రంగాలపై పడటంతో రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి పూర్తిగా చిన్నాభిన్నమయింది. ఉద్యమాలు చేస్తున్న నాయకులకి, వాటిని ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ నేతలకి పెద్దగా తేడా చేయకపోయినా, ఎక్కడో మారుమూల గ్రామంలో బ్రతుకుతున్న నిరుపేదలు కూడా దీనికి మూల్యం చెల్లించవలసి వస్తోంది. రాష్ట్రంలో నేడు నెలకొన్న అస్తవ్యస్త పరిస్థితులకి ఈ ఉద్యమం మొదటి కారణం కాగా, ప్రభుత్వ అసమర్థత, అవినీతి రెండో కారణంగా చెప్పవచ్చును.
ఇటువంటి నేపద్యంలో, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలoటూ ‘రాయలసీమ పరిరక్షణ సమితి’ని స్థాపించిన బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గత కొన్ని రోజులుగా ట్రాక్టర్ పై రాయలసీమ జిల్లా యాత్రలు చేస్తూ తమ ప్రాంతానికి జరిగిన అన్యాయాలను ప్రజలకు వివరిoఛి వారిని క్రమంగా ఉద్యమం దారి పట్టిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా తమ ప్రాంతానికి న్యాయం చేయలేదని, చివరికి కర్నూలు నగరం రాజధాని అయ్యే అవకాశాన్ని కూడా తమవారే పాడుచేసారని ఆయన అన్నారు. రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఇక ప్రత్యేక రాష్ట్రo ఏర్పడటం ఒకటే మార్గం అని ఆయన అన్నారు. అందుకోసం త్వరలోనే ఒక రాజకీయ పార్టీని స్థాపించాలనుకొంటున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే తన పార్టీ పేరు, సభ్యుల పేర్లు తదితర వివరాలు ప్రకటిస్తామని ఆయన మీడియాకు తెలిపారు.