ఏపీలోనూ ఉప ఎన్నిక.. వైసీపీ వ్యూహం
posted on Aug 8, 2022 7:53AM
ఏపీలో వైసీపీకి గోరంట్ల మాధవ్ కారణంగా తీవ్ర డ్యామేజీ జరిగింది. పార్టీ వర్గాలే కాదు.. అధినాయకత్వం కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తోంది. దీనిపై మాధవ్ పై చర్య తీసుకోవాలని పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది. వివరణ కోసం అమరావతి రావాలన్న అధిష్ఠానం ఆదేశాలను గోరంట్ల మాధవ్ ధిక్కరించారన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో మాధవ్ ను బుజ్జగించైనా సరే ఆయన చేత రాజీనామా చేయించాలని జగన్ భావిస్తున్నారు. అందుకే విచారణ అంటూ మాధవ్ పై వేటు వేయకుండా జాప్యం చేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.
గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో కారణంగా పార్టీకి కలిగిన నష్టాన్ని నివారించడంతో పాటుగా ఇటీవలి కాలంలో వైసీపీపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి కూడా చెక్ పెట్టే విధంగా గోరంట్ల మాధవ్ చేత అనంతపురం ఎంపీ పదవికి రాజీనామా చేయించి, తద్వారా వచ్చే ఉప ఎన్నికలో పార్టీ టికెట్ ఆయనకే ఇచ్చి గెలిపించుకోవడం ద్వారా మాధవ్ కారణంగా పార్టీకి కలిగిన నష్టాన్ని పూడ్చుకోవాలనీ, అలాగే ప్రజావ్యతిరేకత అంటూ విపక్షాల ప్రచారానికి చెక్ పెట్టాలనీ జగన్ భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి.
ఆ కారణంగానే మాధవ్ ను ఇంత వరకూ పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. గోరంట్ల మాధవ్ చేత పార్టీకి కాకుండా ఎంపీ పదవికి రాజీనామా చేయించడం ద్వారా.. పార్టీ ఆయనను నమ్ముతోందని మాధవ్ లో విశ్వాసం కలిగించడమే కాకుండా.. ఆయనకే టికెట్ ఇచ్చి గెలిపించుకుంటామన్న హామీ ఇవ్వడం ద్వారా మాధవ్ ధిక్కార ధోరణిలో వ్యవహరించకుండా నియంత్రించడానికి అవకాశం ఉంటుందన్నది జగన్ యోచనగా చెబుతున్నారు.
అదీ కాకుండా మాధవ్ రాజీనామా వల్ల అనంతపురం పార్లమెంటు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో అధికారంలో ఉన్న పార్టీగా వైసీపీకే విజయావకాశాలు ఉంటాయని జగన్ గట్టిగా భావిస్తున్నారు. అందుకే మాధవ్ చేత ఎంపీ పదవికి రాజీనామా చేయించి.. తద్వారా వచ్చే ఉప ఎన్నికలో ఆయనకే పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించుకుని విపక్షాలకు చెక్ పెట్టాలనీ, అదే విధంగా పార్టీకి ప్రజలలో ఆదరణ తగ్గలేదన్నది చాటాలని జగన్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.