ఫిబ్రవరి17న సంచలన ప్రకటన?.. ముందస్తా?.. కేటీఆర్ పదోన్నతా?
posted on Feb 10, 2023 6:37AM
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు వస్తాయో లేదో కానీ, ముందస్తు ఎండలు, ముందస్తు విద్యుత్ కోతలు అయితే వచ్చేశాయి. అలాగే ముందస్తు ఎన్నిక వాతావరణ కూడా ముందుగానే తలుపులు తడుతోంది. ఓ వంక ప్రతిపక్ష పార్టీలు పాదయాత్రలు, పబ్లిక్ మీటింగ్స్ తో ప్రజల మధ్యకు వెళుతుంటే, అధికార బీఆర్ఎస్ అసెంబ్లీని వేదిక చేసుకుని ఎన్నికల ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ముఖ్యంగా ఐటీ మంత్రి కేటీఆర్ తన వాగ్దాటితో విపక్షాలను గుక్క తిప్పుకోకుండా ఏకి పారేస్తున్నారు.
చివరకు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా మాజీ మిత్రుని వాగ్ధటిని మెచ్చుకున్నారంటే కేటీఆర్ ఏ స్థాయిలో దూకుడు పెంచారో వేరే చెప్పనక్కరలేదు. ఒక విధంగా అసెంబ్లీలో డీఫ్యాక్టో ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరిస్తున్నకేటీఆర్ అటు కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని, ఇటు కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలను ఒకే రీతిన ఏకి పారేస్తున్నారు. ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేస్తూ కేటీఆర్ చేస్తున్న విమర్శలు ఎన్నికల ప్రసంగాల హీటును దాటేశాయి. అందుకే మంత్రి కేటీఆర్ దూకుడు చూస్తే ముందస్తు ఎన్నికలకు సంకేతమా అనే అనుమానాలకు తావిచ్చేలా ఉందని అంటున్నారు. ముందస్తుకు రంగం సిద్డంవుతుందా, లేక కేటీఆర్ పదోన్నతికి సన్నాహాలు జరుగ్తున్నాయా అనే అనుమానాలు సైతం వ్యక్త్రమవుతున్నాయి.
అసెంబ్లీ లోపలే కాదు, బయట కూడా ఇటు ప్రభుత్వ, అటు పార్టీ వ్యవహరాలలోనూ కేటీఆర్ దూకుడు పెంచారు. ఒక విధంగా ఆయన ‘కొత్త చెప్పుల్లో’ కాలుపెట్టేందుకు సిద్డం అవుతున్నారా అనే అనుమనాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈనెల 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయాలని గ్రేటర్ నేతలకు మంత్రి కేటీ రామారావు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ కమిటీ హాల్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి కనీసం 10వేల మంది హాజరయ్యేలా చూడాలని నేతలకు సూచించారు. నిజానికి, సచివాలయం ప్రారంభోత్సవం అధికారిక కార్యక్రమం, కానీ, సచివాలయం ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని, బీఆర్ఎస్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ భారీ సభ ను విజయ వంతం చేసే బాధ్యతను కేటీఆర్ తీసుకున్నారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేసమయ్యారు. ఈనెల (ఫిబ్రవరి) 17న సచివాలయం ప్రారంభోత్సవం తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న సభకు భారీ జనసమీకరణ చేయాలని గ్రేటర్ నేతలకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. ఈనెల 13న గ్రేటర్ పరిధిలోని నియోజకవర్గాల్లో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నిర్వహించాలన్నారు. ఒక్కో నియోజకవర్గానికి ఇతర జిల్లాలకు చెందిన సీనియర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఇన్‌ఛార్జిలుగా నియమించనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈనెల 13 నుంచి 17వరకు ఇన్‌ఛార్జిలు వారికి కేటాయించిన నియోజకవర్గాల్లోనే ఉండి జనసమీకరణ ఏర్పాట్లను పర్యవేక్షిస్తారని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టినందున అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు. సచివాలయం ప్రారంభోత్సవం, పరేడ్‌గ్రౌండ్ సభను అందరూ కలిసికట్టుగా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
అదలా ఉంటే, కేటీఆర్ లో కనిపిస్తున్న కొత్త ఉత్సాహం దేనికి సంకేతం అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. అయితే అదేమిటనే విషయంలో మాత్రం క్లారిటీ లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నాయకులు ఫిబ్రవరి 17 సంచలన ప్రకటన ఉంటుందని అంటున్నారు.