ఆరు రాష్ట్రాలలో బీఆర్ఎస్?
posted on Dec 21, 2022 @ 11:47AM
కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఆరు రాష్ట్రాలలో తన కార్యకలాపాలను విస్తరించడానికి ప్రణాళికలు, కార్యాచరణ సిద్ధం చేసింది. దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ ను విస్తరించాలన్న వ్యూహంలో భాగంగా ముందుగా ఆరు రాష్ట్రాలను ఎంపిక చేసుకుంది.
ఇందు కోసం ముందుగా ఆ ఆరు రాష్ట్రాలలోనూ బీఆర్ఎస్ అనుబంధ సంస్థ బీఆర్ఎస్ కిసాన్ సమితిని ప్రారంభించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ముందుగా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా, సహా ఆంధ్ర ప్రదేశ్ లలో బీఆర్ఎస్ కిసాన్ సెల్ లు ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.
ఈ సారి రైతు రాజ్యం అన్ననినాదంతో ముందుకు పోవాలని అధికారికంగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించిన నాడే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ మేరకే ఏపీ సహా ఆరు రాష్ట్రాలలో బీఆర్ఎస్ తన కార్యకలాపాలను విస్తరించ నుంది. ఏపీ సహా పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, కర్నాటక, ఒడిస్సా రాష్ట్రాలలో క్రిస్మస్ తరువాత ఏ క్షణంలోనైనా బీఆర్ఎస్ కిసాన్ సెల్ లు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.