అదానీ విషయంలో బీఆర్ఎస్ వింత డిమాండ్!
posted on Nov 26, 2024 9:05AM
దిగ్గజ పారిశ్రామికవేత్త అదానీ ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. విద్యుత్ ఒప్పందాల విషయంలో లంచాలు ఇచ్చినట్లుగా అమెరికా దర్యాప్తు సంస్థలు నిర్ధారించాయి. ఈ మేరకు అదానీ సహా మరో ఎనిమిది మందిపై కేసులు కూడా నమోదయ్యాయి. విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో సహా మరో నాలుగు రాష్ట్రాల అధికారులకు అదానీ కంపెనీ నుంచి ముడుపులు చెల్లించినట్లు అమెరికాలో నమోదైన కేసు చార్జిషీట్ లో ఉంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది. ఈ వ్యవహారం అగ్రరాజ్యం అమెరికా, భారత్ సంబంధాల మీద అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతుందన్న వాదన కూడా వినిపిస్తుంది. అయితే, ఈ అంశంపై ఇంకా భారత ప్రభుత్వం అధికారికంగా స్పందించలేదు. వైట్ హౌస్ స్పందించింది. దర్యాప్తు సంస్థలు ఖచ్చితమైన సమాచారంతోనే ముందుకెళ్తాయని.. ఇలాంటి పరిస్థితుల్ని రెండు దేశాలు సమర్థంగా ఎదుర్కొంటాయని ప్రకటించింది. మరోవైపు, తమ కంపెనీపై వచ్చిన ఆరోపణల్ని అదానీ గ్రూప్ ఖండించింది. కానీ అమెరికా న్యాయస్థానాల నుంచి ఆయన తప్పించుకోవడం అంత తేలిక కాదు. భారత్, అమెరికా మధ్య నేరస్తుల అప్పగింత ఒప్పందం ఉంది. అయితే అదానీని భారత్ అంత తేలికగా అప్పగించే అవకాశాలు లేవు.
అవినీతి ఆరోపణలపై అమెరికాలో కేసు నమోదైన అదానీని తక్షణమే అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. అదానీ గురించి తాము ఇన్నాళ్లుగా చెబుతున్నది నిజమని అమెరికా అధికారుల ఆరోపణలు నిరూపించాయన్నారు. అదానీ భారత్‌లోనేగాక అమెరికాలోనూ చట్టాలను ఉల్లంఘించినట్లు స్పష్టమవుతోందని, అలాంటి వ్యక్తి బయట స్వేచ్ఛగా ఎలా తిరగగలుగుతున్నారో ఆశ్చర్యంగా ఉందన్నారు. స్వలమైన ఆరోపణలపై ఏకంగా ముఖ్యమంత్రులనే అరెస్టు చేస్తున్నప్పుడు.. రూ.2,200 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న అదానీ స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నారని, ఎలా తిరగనిస్తున్నారనీ రాహుల్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మరోవైపు, పార్లమెంటు శీతాకాల సమావేశాలు సోమవారం(నవంబర్ 25) ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన తొలిరోజే విపక్ష సభ్యులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అదానీ ఇష్యూపై చర్చ కోసం పట్టుబట్టారు. సభను నినాదాలతో హోరెత్తించారు. దీంతో తొలి రోజే స్పీకర్ ఓం బిర్లా సమావేశాలను నవంబర్ 27వ తేదీకి వాయిదా వేశారు. ఇక రాజ్యసభలోనూ ఇదే తంతు కొనసాగింది. గౌతమ్ అదాని వ్యవహారంపైన చర్చకు ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. దీంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను ఎల్లుండికి వాయిదా వేశారు.
అదానీ ముడుపుల వ్యవహారంపై అమెరికా కోర్టు సమన్లు జారీ చేసిన నేపథ్యంలో తెలంగాణలో ఆయన ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసిన ప్రభుత్వాల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత స్కిల్ యూనివర్సిటీకి అదానీ రూ.100 కోట్లు విరాళంగా ప్రకటించారు. అయితే, వాటిని స్వీకరించ కూడదని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయించింది. స్కిల్ యూనివర్సిటీకి రూ.100 కోట్లు బదిలీ చేయవద్దని.. అదానీ సంస్థకు తెలంగాణ ప్రభుత్వం తరఫున లేఖ సైతం రాయడం జరిగింది. అయితే, తెలంగాణలో అదానీ కంపెనీ అధికార పెట్టుబడులపై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. రాజ్యాంగ బద్ధంగా, చట్టబద్ధంగానే అదానీ నుంచి పెట్టుబడులు స్వీకరించినట్లు వెల్లడించారు. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని లాగవద్దని ప్రతిపక్షాలకు ఆయన సూచించారు. కానీ మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు మాట్లాడుతూ.. స్కిల్ యూనివర్సిటీకి ఇచ్చిన 100 కోట్లు నిధులు వెనక్కి ఇచ్చారు సరే.. అదానీ అవినీతిపై రాహుల్ గాంధీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్‌లో మీరు అదానీతో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేంటని, అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీశ్‌రావు ప్రశ్నించారు.
వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోనే అదానీ కంపెనీ రాష్ట్రంలో ఎక్కువ పెట్టుబడులు పెట్టింది. మామిడిపల్లిలో అదానీ ఎల్బిట్ సిస్టమ్స్ పేరిట డిఫెన్స్ యూనిట్ ఏర్పాటుకు కేసీఆర్ నేతృత్వంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఆమోదించింది. 25 ఎకరాల్లో ఏర్పాటైన ఈ యూనిట్ 2025 జనవరి నుంచి ఉత్పత్తి ప్రారంభించనుంది. సీఎం కేసీఆర్ తొలిసారి ముఖ్యమంత్రి అయిన నెలరోజులకే గౌతమ్ అదానీతో భేటీ అయ్యారు. 2018 దావోస్ సదస్సులో అప్పటి మంత్రి కేటీఆర్ అదానీని కలిసి విమాన విడిభాగాల తయారీ ప్లాంట్ నిర్మాణానికి ఆమోదం తెలిపారు. తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టులు నిర్మించాలని గతంలో అదానీ కంపెనీని కేసీఆర్ ఆహ్వానించారు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో అదానీతో పలు ఒప్పందాలు చేసుకున్నారని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్నారు. వాటన్నింటిని పక్కనపెట్టి.. రూ. 100 కోట్ల విరాళాన్ని తిరస్కరించిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని.. ప్రాజెక్టు ఒప్పందాలపై ఏం చేస్తారని హరీశ్ రావు ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.