మీరు టిఫిన్ చేయడం లేదా..?

 

లేటుగా లేవడమో.. సమయం లేకపోవడమో సాకుగా చూపుతూ చాలా మంది ఉదయం పూట ఏమీ తినకుండా హడావిడిగా బస్సో, రైలో పట్టుకొని ఆఫీసులకు పరిగెడుతూంటారు. కానీ ఇలా చేయడం వల్ల దీర్ఘకాలంలో ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తుందంటున్నారు నిపుణులు. ముందు రోజు రాత్రి 10 గంటలకు తిని తిరిగి మరుసటి రోజు మధ్యాహ్నం వరకు దాదాపు 15 గంటలకు పైగా కడుపును మాడ్చేస్తుంటారు.

 

కాని తప్పు తెలుసుకునేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కొన్ని రోజులకు చిన్న పనికే అలసిపోవడం.. మరికొన్ని రోజులకు రక్తహీనత ఇలా పలు రకాల అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయి. రాను రాను పనిమీద ఆసక్తి తగ్గిపోవడం, చిరాకు పెరగడం వంటి మానసిక సమస్యలు కూడా వస్తుంటాయి. దీనికి కారణం శరీరానికి అవసరమైన పోషకాలు లోపించడమే.. ఈ పోషకాలు లోపించడానికి మూలం ఉదయం పూట ఆహారం తీసుకోకపోవడమే. మన శరీరం రోజువారీ పనులు చేయాలంటే అందుకు తగినంత శక్తి అవసరం. మరి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది. మనం తీసుకునే ఆహారం నుంచే.

 

మనం తిన్న ఆహారం మూడు నుంచి నాలుగు గంటల్లో జీర్ణం అయిపోతుంది. కాబట్టి ప్రతి నాలుగు గంటలకు ఏదో ఒకటి తినాలి అంటారు పెద్దలు. అలాంటిది ఏకంగా 10 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటే శరీరానికి అవసరమైన శక్తి అందదు. దీని వల్ల పోను పోను రకరకాల గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అథెరోస్క్లె‌రోసిస్ అనే అనారోగ్య సమస్య ఉత్పన్నమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దళసరిగా ఉన్న ధమనులు గుండె నుంచి ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని ఇతర భాగాలకు సరఫరా చేస్తాయి.

అయితే బ్రేక్‌ఫాస్ట్ చేయకపోవడం వల్ల ధమనుల పనితీరు మందగించడాన్ని వారు గుర్తించారు. సరైన సమయానికి అల్పాహారం తీసుకోకపోయినా, తక్కువ పోషకాలున్న అల్పాహారం తీసుకున్నా ఈ సమస్య తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఎంత ఆలస్యమవుతున్నా.. ఎన్ని పనుల్లో తలమునకలై ఉన్నా సరే అల్పాహారం చేసి తరువాత ఎటువంటి పనైనా చేయండి.