Read more!

ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు విఫలం

ఉపాధ్యాయ సంఘాలతో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ జరిపిన చర్యలు విఫలమయ్యాయి. ఉపాథ్యాయుల హాజరు కోసం ప్రభుత్వం తప్పని సరి చేసిన ఫేస్ రికగ్నేషన్ యాప్ పట్ల ఉపాధ్యాయులు తీవ్ర ఆగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సంగతి విదితమే. ఆ యాప్ డౌన్ లోడ్ చేయడం, దాంట్లో లగిన్ అవ్వడం తప్పని సరి చేయడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రతి రోజూ తమ అటెండెన్స్ కు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ లో ఫొటోలు అప్ లోడ్ చేయాలన్న ప్రభుత్వ నిబంధనను ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో మంత్రి బొత్స సత్యానారాయణ తో ఉపాధ్యాయ సంఘాల నేతలు భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రితో వారు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. చర్చల అనంతరం బొత్స మాట్లాడుతూ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ విషయంలో ఉపాధ్యాయులలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్నారు. ఓ 15 రోజులు శిక్షణ తరగతులు నిర్వహించిన తరువాతే దీనిని అమలులోనికి తీసుకువస్తామన్నారు. ఈ నెలాఖరులోగానే టీచర్లకు శిక్షణ ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పటికే లక్ష మంది ఉపాధ్యాయులు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారనీ, శిక్షణ కోసం తమ పేర్లు రిజిస్టర్ చేసుకున్నారనీ వివరించారు.

 ఈ విషయంలో ప్రభుత్వం మంచి ఉద్దేశంతో ముందుకు వెళ్లోందనీ, ఉపాధ్యాయులు సహకరించాలని మంత్రి బొత్స కోరారు. రానున్న రోజులలో అన్ని శాఖలలోనూ  ఇదే విధానం అమలు అవుతుందని అన్నారు.  కాగా దీనిపై ఉపాధ్యాయులు మాత్రం  సొంత ఫోన్లలో ఫేస్ రికాగ్నిషన్ యాప్ కు ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. సొంత ఫోన్లలో యాప్ డౌన్ లోడ్ చేస్తే వ్యక్తిగత సమాచారానికి ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అంటున్నారు.

పాఠశాలలోనే మౌఖిక హాజరు పరికరాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వమే మొబైల్ డేటాతో కూడిన ఫోన్లు ఇస్తే తమకు అభ్యంతరం లేదని తెలిపారు.