నిద్ర సుఖమెరుగునా ?!
posted on Jun 29, 2022 @ 12:44PM
కాయకష్టం చేసి వొళ్లు తెలీని నిద్రలోకి జారుకోవడం ఒక లెక్క. హఠాత్తుగా వొంట్లో బాగాలేక ఏ చెట్టు కింద నో కాస్తంత విశ్రమించి అలా నిద్రలోకి జారుకోవడం మరో లెక్క. కానీ వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణది మరో లెక్క! ఒక వంక ప్లీనరీ జరుగుతోంది, ఆయన మాత్రం హాయిగా నిద్రలోకి జారారు. అంటే ఆ ప్లీనరీ ఎంత ఆసక్తిగా సాగుతోందో ఇట్టే అర్ధమైపోతుంది. ఎన్నికల సమయంలో నేతల ప్రసంగాలు ఒకింత బోరు కొడతాయి.
విసుగెత్తి ప్రజలు ఇంటికి వెళ్లవచ్చు. ఏదో అర్జంటు ఫోన్ కాల్ అనీ వెళ్లవచ్చు. కానీ బొత్సగారికి బొత్తిగా ఆ అవకాశమే లేదు. ఎందుకంటే ప్లీనరీలో జనం కంటే మంత్రులు, నాయకులే అధిక సంఖ్యలో వున్నారు. పైగా బొత్స మధ్యలో వెళిపోతే, పోనీ ఓ పది నిమిషాలకైనా అలా తిరిగేసి రావడానికి వెళ్లినా మీడియా వారు ఠక్కున పట్టేసుకుంటారు. ప్లీనరీ అత్యం త ముఖ్యమైన అంశాలు చర్చిస్తారు. వారి అత్యంత మాటెలా వున్నా ఇంత బోర్ కొట్టేట్టు వుందనేది బొత్స వైఖరే చెబుతుంది.
కానీ బొత్స కునుకుకి తాత్పర్య మదేనని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఆయన ఆంధ్రా దేవెగౌడ అనుకోవాలా? పాపం ఆ పెద్దాయన కూడా వీలయినంతవరకూ కలల్లో విహరించడానికే ఇష్టపడతారు. అది జాతీయ స్థాయి సదస్సయినా, అంతర్జాతీయ సదస్సయినా, నిద్రా దేవి మహత్తు అలాంటిది మరి. గట్టిగా మాటలు విన్నపుడు, ఎవరో పిలిచినట్టు విన్నపుడు ఠక్కున లేచి సాలోచనగా చుట్టూ చూసి తానేదో అద్బుత ఆలోచనలో వున్నట్టు నటించడంలో ఇలాంటివారు ఘనాపాటి! ప్లీనరీకి భారీ ప్రచారం చేసుకున్నా చాలాతక్కువ మంది హాజరయి నాయకులను నిరావపరిచారు. ఇదేదో పార్టీ ఆఫీసులోనే కానిచ్చేస్తే బాగుండేదిగా అనుకుంటున్నారు. సాలూరు, బొబ్బిలిలో జరిగిన ఫ్లీనరీలకు మంత్రి బొత్స, ఉప ముఖ్యమంత్రి రాజన్నదొర తో పాటు పలువురు నేతలు హాజరయ్యారు. ఫ్లీనరీ ప్రారం భం నుంచి పలు సందర్భాల్లో కునుకు తీస్తున్న మంత్రి బొత్సను చూసిన నేతలు ఆయనకు నిద్రాభంగం కలగనీయలేదు.
ఇక సాలూరు సభలో అయితే వచ్చిన కార్యకర్తలే తక్కువ. సభ ప్రారంభం కాగానే మూడొంతుల జనం ఇంటి ముఖం పట్టారు. ఎక్కువ శాతం ఖాళీ కుర్చీలకు నేతలు ప్రసంగాలు వినిపించాల్సి వచ్చింది. నాలుగు మండలాల నుంచి ఆశించిన స్థాయిలో కార్యకర్తలు రారనుకున్నారో.. రాలేరనుకున్నారో గానీ.. బొబ్బిలో చిన్న పాటి హాలులో ఫ్లీనరీ జరిపించేసి మమ అనిపించారు. అయితే సాలూరు సభలోనూ మంత్రి బొత్స కునుకు తీశారు. ఏది ఏమైనా ఫ్లీనరీ సమావేశంలో కునుకుతీసి బుక్ అయ్యారు.