గురువులపై గౌరవం ఇదేనా?
posted on Apr 2, 2023 @ 4:39PM
వైసీపీ మంత్రులకు గౌరవం ఇవ్వడం అనే పదానికి అర్ధం తెలియదనడానికి ఆ పార్టీ రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. జగన్ తొలి కేబినెట్ లో కొందరు మంత్రులు విపక్ష నేతపై చేసిన వ్యాఖ్యలు, మరి కొందరు మంత్రులు మహిళల పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇలా ఎన్నైనా ఉదాహరణలు చెప్పవచ్చు. తాజాగా విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ టీచర్ల పట్ల అగౌరవంగా వ్యవహరించారు.
చదువునేర్పే గురువులకు ఇవ్వాల్సిన కనీస మర్యాద కూడా ఇవ్వకుండా వారిని నిలబెట్టి మాట్లాడారు. తనను కలిసేందుకు వచ్చిన ఉపాధ్యాయ సంఘాల నేతలను నిలబెట్టి.. తాను మాత్రం దర్జాగా కాలుమీద కాలు వేసుకుని కూర్చుని మాట్లాడారు. విద్య నేర్పే గురువులకు విద్యామంత్రి ఇచ్చిన గౌరవం ఇది. ఇందుకు సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది.
తమ సమస్యలకు సంబంధించి విద్యాశాఖ మంత్రితో చర్చించేందుకు ఆయన వద్దకు వెళ్లిన గురువులకు అవమానం, పరాభవమే ఎదురైంది. ఉన్నత విద్యావంతుడైన బొత్స సత్యనారాయణ గురువులకు దణ్నాలు పెట్టక్కర్లేదు, కనీసం కుర్చోబెట్టి మాట్లాడాలన్న ఇంగితాన్ని కూడా ప్రదర్శించలేదు.
దీనిపై నెటిజన్లు బొత్స సత్యానారాయణపై ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. పేరుకే ఆయన విద్యామంత్రి కనీస సంస్కారం కూడా ఆయనలో కనిపించడం లేదు అని ట్రోల్ చేస్తున్నారు. గురువు తెలియని వ్యక్తి విద్యాశాఖ మంత్రి కావడం ఆ శాఖ దురదృష్టం అని నెటిజన్లు బొత్స సత్యనారాయణ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు.