సోనియమ్మకు సీమాంధ్ర స్వాగతం: బొత్స
posted on Feb 28, 2014 @ 2:06PM
రాష్ట్రంపై రాష్ట్రపతి పాలన విదించడంతో ముఖ్యమంత్రి కావాలని కలలుగన్న ముగ్గురు సీమాంధ్ర కాంగ్రెస్ నేతల పరిస్థితి వ్రతం చెడినా ఫలం దక్కనట్లయింది. ముఖ్యమంత్రి పదవి దక్కకపోగా అందుకు అర్రులు చాచినందుకు ఉన్న పరువు కూడా పోయింది. పైగా వారి పోటీ కారణంగానే రాష్ట్రంలో మళ్ళీ రాష్ట్రపతి పాలన కూడా విదింప బడిందనే అపవాదు కూడా మూటగట్టుకొన్నారు. అయితే, రానున్న ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలో పది సీట్లయినా గెలుస్తుందో లేదో తెలియకపోయినా బొత్స సత్యనారాయణ మాత్రం విభజన పూర్తయిన తరువాత ఏర్పడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి అయ్యేందుకు గాను సోనియమ్మను ఇప్పటి నుండే ఏదోవిధంగా ప్రసన్నం చేసుకొనే ప్రయత్నాలు మొదలుపెట్టేసారు.
సీమాంధ్ర ప్రజల ఆగ్రహానికి గురయిన ఆమె వారి గురించి ఒక మాట మాట్లాడేందుకు సాహసించలేకపోతున్నఈ తరుణంలో ఆమెను సీమాంధ్రలో పర్యటించవలసిందిగా బొత్స సత్యనారాయణ కోరారు. ఆమెను, కాంగ్రెస్ పార్టీని సీమాంధ్ర ప్రజల ముందు దోషిగా నిలబెడుతున్న ప్రతిపక్షాలను ఎదుర్కొని పార్టీని బ్రతికించుకోవాలంటే ఆమె తప్పనిసరిగా సీమంధ్రలో పర్యటించాలని ఆయన కోరుతున్నారు. ఒకసారి ఆమె సీమాంధ్రకు వచ్చి ప్రజల కోసం తమ పార్టీ ఏమేమి చేయబోతోందో చెపితే చాలు వారు గ్యారంటీగా పడిపోతారని ఆయన హామీ ఇస్తున్నారు. అయితే ఆమె మాత్రం వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం.
ఆమె రాజకీయ సలహాదారులు మాత్రం ఈ విభజన వేడి తగ్గి ప్రజలు శాంతించే వరకు మరికొంత కాలం ఆగి వెళితేనే మేలని సూచిస్తున్నారు. కానీ తమ రాజకీయ ప్రత్యర్ధి నరేంద్ర మోడీ పర్యటన ఖరారు అవుతుండటంతో బహుశః కనీసం యువరాజ వారినయినా సీమాంధ్ర ప్రజలను అనుగ్రహించేందుకు పంపించవచ్చును.