కిరణ్ కొత్త పార్టీ పెట్టరు: బొత్ససత్యనారాయణ

 

రాష్ట్ర విభజన ను వ్యతిరేఖిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి త్వరలో తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి వేరే కొత్త పార్టీ పెడతారని మీడియాలో వస్తున్న వార్తలను ఆయన ఎన్నడూ గట్టిగా ఖండించేప్రయత్నం చేయలేదు. కానీ ఆయన తరపున పార్టీలో ఇతర నేతలు మాత్రం మాట్లాడుతున్నారు. కొత్త పార్టీ పెడితే ప్రజల నుండి ఎటువంటి స్పందన వస్తుందో తెలుసుకొనేందుకే బహుశః ఆయన ఈపద్ధతి ఎంచుకొన్నారేమో మరి తెలియదు.

 

నిన్న బొత్ససత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ “పార్టీ నుండి బయటకు పోదలచిన వారు పోవచ్చు. శాసనసభకి బిల్లు వచ్చేవరకు వేచి చూడనవసరం లేదు. పార్టీకి నష్టం కలిగిస్తున్నవారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొనేందుకు అధిష్టానం అనుమతించింది. త్వరలోనే చర్యలుంటాయి,” అని ప్రకటించారు. ఆ వెంటనే ‘కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోరని’ మరో కొత్త కబురు చెపుతున్నారు.

 

ఒకవైపు పోయేవాళ్ళు పొండని చెపుతూ, పోకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిస్తూనే, అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరిస్తున్నకిరణ్ కుమార్ రెడ్డి మాత్రం పార్టీలో కొనసాగుతారని బొత్స చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ కిరణ్ కుమార్ రెడ్డి బయటకి వెళ్ళకపోతే మరప్పుడు పార్టీలో ఆయన పరిస్థితి ఏమిటి? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని తపిస్తున్న బొత్స పరిస్థితి ఏమిటి?

 

కనీసం వచ్చే ఎన్నికల వరకయినా కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంపై అధికారం వెలగబెట్టే అవకాశం ఉంటుంది కనుక మరి ఆలోగా రాష్ట్రం విడిపోతే ఆంధ్రప్రదేశ్ కి మొదటి ముఖ్యమంత్రి ఎవరవుతారు?కిరణ్ కుమార్ రెడ్డా? బొత్ససత్యనారాయణా? లేక కన్నా లక్ష్మినారాయణా లేక కొత్తగా నాలుగో కృష్ణుడు రంగం మీదకి వస్తాడా?