ఉగ్రవాదులు చొరబడిన సొరంగం ద్వారా పాకిస్తాన్ లోకి ఎంటరైన బీఎస్ఎఫ్ జవాన్లు..
posted on Dec 2, 2020 @ 9:34AM
కశ్మీర్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను భగ్నం చేసే లక్ష్యంతో పాకిస్తాన్ నుండి భారత్‌లోకి ప్రవేశించిన జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులను గత నెల 19న జమ్మూకశ్మీర్‌లోని నగ్రోటా వద్ద భద్రతా దళాలు కాల్చి చంపాయి. ఈ ఘటనలో వారి నుంచి భారీగా ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల నుంచి అంత పెద్ద మొత్తంలో ఆయుధాలు లభ్యం కావడంతో అధికారులు విచారణ చేపట్టగా సొరంగ మార్గం ద్వారా వారు కశ్మీర్‌లోకి ప్రవేశించినట్టు తేలింది. ఉగ్రవాదులు భారత్‌లోకి అక్రమంగా చొరబడేందుకు ఏర్పాటు చేసిన రహస్య సొరంగ మార్గాన్ని బిఎస్ఎఫ్ జవాన్లు గుర్తించారు.
దీంతో ఉగ్రవాదులు ఉపయోగించిన ఈ రహస్య సొరంగ మార్గం లోకి ఓ బిఎస్ఎఫ్ బృందం ప్రవేశించి దానివెంట 200 మీటర్ల మేర పాకిస్థాన్ భూభాగంలోకి ప్రయాణించారు. దీంతో దాయాది పాకిస్తాన్ కుట్రలను బిఎస్ఎఫ్ బహిర్గతం చేసింది. దీంతో ఈ సొరంగ మార్గం ప్రారంభం పాకిస్థాన్‌లో ఉన్నట్టుగా గుర్తించారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు తమ సైన్యం సహకారంతో వారిని భారత భూభాగంలోకి పంపుతున్నారని భారత్ చేస్తున్న ఆరోపణలపై పాకిస్తాన్ ఎప్పటికప్పుడు బుకాయిస్తున్న నేపథ్యంలో.. తిరిగి వచ్చేటప్పుడు బిఎస్ఎఫ్ బృందం సాక్ష్యాధారాల కోసం వీడియో తీసినట్టు బీఎస్ఎఫ్ డీజీ రాకేశ్ ఆస్తానా తెలిపారు. ఈ సొరంగ మార్గం సాంబా జిల్లా బోర్డర్ పోస్ట్ సమీపంలో ఉన్నట్లు కనుగొన్నారు. అంతర్జాతీయ సరిహద్దు నుంచి 160 మీటర్లు, సరిహద్దు కంచె నుంచి 70 మీటర్ల పొడవు, 25 మీటర్ల లోతులో ఈ రహస్య సొరంగం ఉందని.. భారత వైపు దట్టమైన పొదల మధ్య దీని ద్వారం ఉందని ఆస్తానా తెలిపారు.