హోంమంత్రి షిండే, చిదంబరం పై 420 కేసు

 

 

 

 

ఆర్ధిక మంత్రి చిదంబరం, హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ల పై ఎల్బీనగర్ పోలీసులు 420 కేసులు నమోదు చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అంశం మీద ఏ విషయం వెల్లడిస్తాం అని గడువు విధించి మాట తప్పి తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపిస్తూ తెలంగాణ వాదులు రంగారెడ్డి కోర్టులో పిటీషన్ వేశారు. తెలంగాణ అంశం మీద ఇచ్చిన మాట తప్పి వేలాది మంది ఆత్మహత్యలకు కారణం అయ్యారని, అప్పటి హోంమంత్రి, ప్రస్తుత ఆర్ధిక మంత్రి చిదంబరం, ఇప్పుడు హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు గడువుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని వారిమీద చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు.


 దీనిమీద విచారించిన కోర్టు మంత్రుల మీద 420 కేసులు నమోదు చేయాలని ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అంశంపై నెలరోజుల్లో తేలుస్తామని గత నెల 28న అఖిలపక్ష సమావేశం అనంతరం హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే  అన్నారు. ఈ రోజుతో ఆ గడువు ముగిసిపోయింది. ఓ రోజు ముందే ఆయన తెలంగాణ అంశం తేల్చేందుకు మరింత సమయం కావాలని, మరిన్ని చర్చలు జరగాలని అన్న నేపథ్యంలో న్యాయవాదులు కోర్టును ఆశ్రయించారు.