వ్యాయామంతో ఎముకలు విరిగిపోతాయా!
posted on Dec 26, 2018 @ 12:05PM
వ్యాయామం వల్ల ఎముకలకి పెద్దగా లాభం ఏమీ ఉండదని ఇన్నాళ్లుగా ఓ అపోహ ఉంది. పైగా ఆస్టియోపొరోసిస్‌లాంటి వ్యాధులు ఉన్నవారు వ్యాయామాలు చేయడం వల్ల ఎముకల విరిగిపోయే ప్రమాదం ఉందన్న హెచ్చరికలూ వినిపిస్తుంటాయి. కానీ వ్యాయామంతో ఎముకలలో అసాధారణమైన మార్పులు చోటు చేసుకుంటున్నట్లు ఓ పరిశోధన నిరూపిస్తోంది.
మన శరీరంలో bone marrow (మూలగ) పాత్ర అంతా ఇంతా కాదు. ఎముక ఎదగడానికీ, ఎర్ర రక్తకణాల ఉత్పత్తికీ, రోగనిరోధక శక్తికీ, హానికారక కణాలను నిర్మూలించడానికీ... బోన్‌మేరోనే కీలకం. శరీరంలో మిగతా చోట్ల ఉన్నట్లుగానే ఈ బోన్‌మేరోలో కూడా కొవ్వు పేరుకుంటూ ఉంటుంది. అయితే ఈ కొవ్వు ఒక్కసారి పేరుకున్న తర్వాత కరగడం అసాధ్యమనీ, ఎవరెంత వ్యాయామం చేసినా దీని మీద పెద్దగా ప్రయోజనం ఉండదని... ఇన్నాళ్లూ భావించేవారు.
బోన్‌మేరో మీద వ్యాయామం ప్రభావం తెలుసుకునేందుకు కాలిఫోర్నియాలోని శాస్త్రవేత్తలు ఓ పరిశోధన చేపట్టారు. దీని కోసం కొన్ని ఎలుకలకి, పుట్టిన నెల రోజుల దగ్గర్నుంచే విపరీతంగా కొవ్వు పదార్థాలని పెట్టడం మొదలుపెట్టారు. దీంతో కొన్నాళ్లకి వాటి బోన్‌మేరో కూడా కొవ్వుతో నిండిపోయింది. ఆ తర్వాత వీటి బోనులో ఓ రన్నింగ్ వీల్ ఉంచారు. ఈ రన్నింగ్ వీల్ మీద తిరగడం అంటే ఎలుకలకి మహా సరదా పడతాయట. సరదా సంగతి పక్కన పెడితే వాటికి మంచి వ్యాయామంగా కూడా ఉంటుంది.
ఇలా ఆరు వారాలు గడిచిన తర్వాత TMRI అనే ఆధునిక పరికరం ద్వారా వీటి బోన్‌మేరోని గమనించిన పరిశోధకులు ఆశ్చర్యపోయారు. వ్యాయామంతో, ఎలుకల బోన్‌మేరోలోని కొవ్వు కణాల సంఖ్య సగానికి సగం తగ్గిపోయాయి. అంతేకాదు! వాటి ఎముకలు మరింత దృఢపడినట్లు తేలింది.
బోన్‌మేరోలో పేరుకునే కొవ్వు, ఎముకల పనితీరు మీద ప్రభావం చూపుతుంది. ఇలాంటి ఎముకలు త్వరగా విరిగిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇక ఒంట్లో డయాబెటిస్, ఆర్థయిటిస్ వంటి సమస్యలు ఉంటే ఎముకలు మరింత సున్నితంగా మారిపోతాయి. ఎముకలు ఎప్పుడైతే సున్నితంగా ఉన్నాయన్న భయం మొదలైందో అసలు వ్యాయామం జోలికే పోకుండా ఉండిపోతుంటారు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా సరే.... వ్యాయామం చేస్తూ ఉంటే, ఎముకలు కోలుకుని బలపడేందుకే ఎక్కువ అవకాశం ఉందని చెబుతున్నారు. కాకపోతే ఎలాంటి వ్యాయామాలు చేయాలో ఒక్కసారి వైద్యుని సంప్రదిస్తే సరి. అంతేకానీ ఊబయాకమో, కీళ్లవ్యాధో ఉంది కదా అని స్తబ్దుగా ఉండిపోతే... మరిన్ని సమస్యలు తప్పవు.
- నిర్జర.