జగన్ కోసమే జనసేనతో గ్యాప్! బీజేపీ గ్రేటర్ వ్యూహం ఇదేనా?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ, జనసేన పొత్తు గందరగోళంగా సాగింది. అసలు ఆ రెండు పార్టీలు కలిసే ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది.  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో జరిగిన పరిణామాలు చూస్తే జనసేనకు బీజేపీ బైబై చెప్పినట్లే కనిపిస్తోంది. అమిత్ షా రోడ్ షోలో పాల్గొనేందుకు వచ్చిన జనసేన కార్యకర్తలను బీజేపీ నేతలు అడ్డుకోవడం, వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని అరవడం చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ప్రచార రథం దిగి మరీ వచ్చి జన సైనికులను అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమకు మద్దతు తెలిపిన పార్టీ కార్యకర్తలను బీజేపీ ఎందుకు వెళ్లగొట్టిందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. 

 

గ్రేటర్ ఎన్నికల్లో జనసేనను బీజేపీ దూరం పెట్టడం వెనక బలమైన కారణాలే ఉన్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా జగన్ కోసమే బీజేపీ జనసేనను దూరం పెట్టిందనే చర్చ జరుగుతోంది.  గ్రేటర్ ఎన్నికల్లో సీమాంధ్ర ఓట్లు కీలకం. దాదాపు 40 డివిజన్లలో వారే గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో వైసీపీ పోటీ చేయటం లేదు. టీడీపీ పోటీలో ఉన్నా.. కొన్ని  డివిజన్లలోనే గట్టి పోటీ ఇస్తోంది.  జనసేన ఓట్లతో పోల్చుకొంటే వైసీపీ , టీడీపీ ఓట్లు చాలా అధికం . ప్రతి డివిజన్లో జనసేన ఓట్లు పదులు వందల్లో ఉంటే వైసీపీ , టీడీపీ ఓట్లు వేలల్లో ఉంటాయి . అవే ఫలితాలని తారుమారు చేస్తాయి. వైసీపీ  పోటీ చేయటం లేదు కాబట్టి వాళ్ళంతా  టీఆర్ఎస్,  బీజేపీకి సమానంగా  ఓట్లు వేస్తారని చెబుతున్నారు. అదే  పవన్ కల్యాణ్ బీజేపీ తరపున ప్రచారం చేస్తే వైసీపీ ఓట్లు బీజేపీకి పడే అవకాశమే లేదు.  పవన్ కల్యాణ్ ను  తీవ్రంగా వ్యతిరేకించే వైసీపీ ఓటర్లు పూర్తిగా టీఆర్ఎస్ సైడ్ కు షిప్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే జగన్ వర్గ ఓట్ల కోసం జనసేనను తెలంగాణ బీజేపీ దూరం పెట్టిందనే చర్చ జరుగుతోంది. 

 

టీడీపీ పోటీలో ఉంది కాబట్టి ఆ పార్టీ కార్యకర్తలు వాళ్ల అభ్యర్థులకే ఓట్లు వేస్తారు. వైసీపీలో పోటీలో లేదు కాబట్టి.. ఆ వర్గం ఓట్ల కోసమే బీజేపీ పవన్ కల్యాణ్ ను గ్రేటర్ ఎన్నికల్లో దూరం పెట్టిందని చెబుతున్నారు. సీమాంధ్ర ఓట్లు టీఆర్ఎస్  కంటే బీజేపీకే ఎక్కువ పడేటట్లు చేసే ప్లాన్లో భాగంగానే ఇదంతా చేస్తున్నారని సమాచారం. అందుకే  దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై వివాదాస్పద కామెంట్లు చేయగానే బీజేపీ పెద్దలు వెంటనే రియాక్ట్ అయ్యారని తెలుస్తోంది. రఘునందన్ రావుకు అక్షింతలు వేసి వెంటనే మాటలు వెనక్కితీసుకోవాలని సూచించినట్లు సమాచారం. హైకమాండ్ ఆదేశాలతోనే మాట్లాడిన కొన్ని గంటల్లోనే రఘునందన్ రావు రిగ్రెట్ చెప్పినట్లు చెబుతున్నారు. 

 

జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ, జనసేన మధ్య మొదటి నుంచి గందరగోళమే కనిపించింది. సొంతంగానే పోటీ చేస్తామని ముందు  ప్రకటించిన పవన్ కల్యాణ్.. తర్వాత యూ టర్న్ తీసుకున్నారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ చర్చలు జరపడంతో పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. బీజేపీ తరపున ప్రచారం కూడా చేస్తానని చెప్పారు. అయితే గ్రేటర్ లో ఆయన  ప్రచారం చేయలేదు. ఇటీవలే  ఢిల్లీ వెళ్లిన జనసేన చీఫ్ .. రెండు రోజుల పాటు అక్కడే ఉండి బీజేపీ పెద్దలతో మంతనాలు జరిపారు. గ్రేటర్ ఎన్నికలతో పాటు త్వరలో జరగనున్న తిరుపతి లోక్ సభ ఉపఎన్నికపై బీజేపీ హైకమాండ్ తో పవన్ కల్యాణ్ మాట్లాడారనే ప్రచారం జరిగింది. ఢిల్లీ నుంచి రాగానే జీహెచ్ఎంసీలో ప్రచారం చేస్తారని అంతా భావించారు. కాని పవన్ కల్యాణ్ ప్రచారానికి దిగలేదు. జనసేనతో తమకు పొత్తు లేదని, వారే పోటి నుంచి తప్పుకున్నారని బీజేపీ ఎంపీ అర్వింద్ చేసిన ప్రకటన దుమారం రేపింది. అర్వింద్ వ్యాఖ్యలపై సీరియస్ గా స్పందించిన జనసేన వెంటనే  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. అయినా బీజేపీ ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. 

 

గ్రేటర్ ఎన్నికల సందర్భంగా తమతో తెలంగాణ బీజేపీ వ్యవహరించిన తీరుపై జనసేనలో ఆగ్రహం వ్యక్తమవుతుందని తెలుస్తోంది. అమిత్ షా  రోడ్ షాలో పాల్గొనేందుకు వచ్చిన తమను అడ్డుకోవడంపై వారు మండిపడుతున్నారు. వైసీపీ ఓట్ల కోసం తమ నేత పవన్ కల్యాణ్ నూ దూరం పెట్టారన్న ప్రచారంతో జనసేన కార్యకర్తలు మరింత రగిలిపోతున్నారు. వైసీపీ ఓట్లు కావాలనుకున్నప్పుడు తమ మద్దతు ఎందుకు కోరారని నిలదీస్తున్నారు. పవన్ కల్యాణ్ మద్దతు కోసం వచ్చిన కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కు వైసీపీ ఓట్ల విషయం అప్పుడు తెలియదా అని ప్రశ్నిస్తున్నారు జన సైనికులు. తెలంగాణ బీజేపీ తమను నమ్మించి మోసం చేసిందనే ఆగ్రహం జనసేన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. తాము పోటీ చేసేందుకు సిద్ధమైన సమయంలో చర్చలు జరిపి మద్దతు కోరారని, నామినేషన్ల పర్వం ముగిశాకా తమను పట్టించుకోవడం మానేశారని జన సైనికులు ఆరోపిస్తున్నారు. 
                 

మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ప్రచారం చేయడానికి సిద్దమైనా పవన్ కల్యాణ్ ను దూరం పెట్టిన బీజేపీ.. తిరుపతిలో మాత్రం మరోలా వ్యవహరించే  అవకాశం ఉందని చెబుతున్నారు . పవన్ కల్యాణ్ ను గ్లామర్ ను తిరుపతిలో తమకు అనుకూలంగా మలుచుకునే  అవకాశం ఉందంటున్నారు. తిరుపతిలో పవన్ సామాజిక వర్గం ఓట్లు భారీగానే ఉన్నాయి. పవన్ ప్రచారం చేస్తే ఆ ఓట్లు బీజేపీకి పడే అవకాశం ఉంది. సాధారణంగా రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో  పవన్ సామాజికవర్గం ఎక్కువగా టీడీపీకి సాంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉంది . పవన్ బీజేపీ తరుపున ప్రచారం చేస్తే ఆ మేరకు టీడీపీకి గండిపడే అవకాశమే ఎక్కువగా ఉంది. అందుకే తిరుపతిలో పవన్ తో బీజేపీ పూర్తిస్థాయిలో ప్రచారం చేయించుకునే అవకాశం ఉంది. మొత్తంగా జనసేన, బీజేపీ తీరు.. గ్రేటర్ లో జరిగిన పరిణామాలతో పవన్ కల్యాణ్ ను తమ అవసరానికి అనుగుణంగా బీజేపీ వాడుకుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.