బీజేపీ అమ్ములపొదిలో రామబాణం
posted on Feb 18, 2021 @ 2:13PM
దేశమంతా కాషాయ జెండా ఎగరేయడమే బీజేపీ ఎజెండా. ఇప్పటికే ఉత్తరాది రాష్ట్రాల్లో బీజేపీ తిరుగులేని పట్టు సాధించింది. దక్షిణాదిపై ఎప్పటి నుంచో గురి పెట్టింది. అయితే.. కర్ణాటక మినహా సదరన్ స్టేట్స్ అంత ఈజీగా కాషాయ పరం కావటం లేదు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండటమే ఇందుకు కారణం. అందుకే, జాతీయ పార్టీల కూటమిల ఆధిపత్యం ఉన్న కేరళపై కన్నేసింది కమలదళం. అందుకు, కేరళపై బీజేపీ వదల బోతున్న రామబాణం మెట్రో మ్యాన్ శ్రీధరన్.
దేశవ్యాప్తంగా కామ్రేడ్ల ప్రభ కనుమరుగవుతోంది. బెంగాల్, త్రిపురలో ఎర్రదండు తోక ముడిచింది. ఒక్క కేరళలోనే సీపీఐ(ఎమ్) అధికారంలో ఉంది. అక్కడ కమ్యూనిష్టులను గద్దె దింపితే.. ఇక ఇండియా మ్యాప్ నుంచి వామపక్ష అధికారాన్ని తొలగించినట్టే. అయితే.. అది అంత ఈజీగా జరిగే పని కాదని బీజేపీకీ తెలుసు. కేరళలో ఆ పార్టీ ఖాతా తెరవడమే కష్టంగా మారింది. ఢిల్లీలో రైతుల ఆందోళనతో మోదీ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. డీజిల్, పెట్రోల్ ధర సెంచరీ వైపు పరుగులు పెడుతుండటం, సామాన్యుడిపై గ్యాస్ గుదిబండగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో కేరళలో మళ్లీ ఎల్.డి.ఎఫ్ అధికారంలోకి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు. పంజాబ్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టినట్టే.. త్వరలో జరగబోవు కేరళ అసెంబ్లీ ఎలక్షన్స్ లో వామపక్షాలకు లేదంటే కాంగ్రెస్.. ఆ ఇద్దరిలో ఒకరికి అధికారం దక్కుతుందని తేల్చి చెబుతున్నారు. పరిస్థితులు ఇంత వ్యతిరేకంగా ఉన్నా.. కమలనాథులు కేరళపై ఏమాత్రం ఆశ వదులుకోవడం లేదు.
కేరళలో కమ్యూనిస్టుల పాలనను అంతం చేసేందుకు బీజేపీ రామబాణం సిద్ధం చేస్తోంది. ఢిల్లీ మెట్రో రూపకర్త, మెట్రో మ్యాన్ గా పేరున్న కేరళకు చెందిన శ్రీధరన్ ను బీజేపీలో చేర్చుకునేలా సన్నాహాలు చేస్తోంది. శ్రీధరన్ తమ పార్టీలో చేరుతున్నారంటూ కేరళ రాష్ట్ర బీజేపీ ప్రకటించింది. ఈ నెల 21న కేరళలో బీజేపీ ‘విజయ యాత్ర’ నిర్వహించనుందని. ఆ సందర్భంగా శ్రీధరన్ బీజేపీలో చేరుతారని కేరళ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సురేంద్రన్ ప్రకటించారు. కేరళలో బీజేపీ అధికారంలోకి వస్తేనే న్యాయం జరుగుతుందని, బీజేపీ ఒప్పుకుంటే తాను ఎన్నికల బరిలోకి దిగడానికి సిద్ధంగానే ఉన్నానని శ్రీధరన్ గతంలోనే ప్రకటించారు. ఆయనొస్తే.. పార్టీ ఇమేజ్ మరింత పెరుగుతుందని.. విద్యావంతులు అధికంగా ఉండే కేరళలో శ్రీధరన్ కు చాలా క్రేజ్ ఉంటుందని అంచనా వేస్తోంది. అయితే.. ఎలాంటి రాజకీయ, పాలనా అనుభవం లేని శ్రీధరన్ ఇమేజ్ బీజేపీకి ఏమేరకు కలిసొస్తుందో చూడాలి.