కైలాసగిరి, ఆర్కే బీచ్ ను అమ్మేస్తారా?
posted on Oct 6, 2021 @ 12:45PM
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతోంది. ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడానికి కూడా నిధులు లేక విలవిలలాడుతోంది. ప్రతి నెలా అప్పులు తెచ్చి జీతాలు చెల్లిస్తోంది. అందినకాడికి అప్పులు తేవడంతో.. కొత్తగా రుణాలు పుట్టే అవకాశాలు కూడా లేకుండా పోయాయి. పరిమితికి మించి పోవడంతో కొత్త రుణాలు ఇవ్వడానికి బ్యాంకర్లు ససెమిరా అంటున్నాయి. దీంతో డబ్బుల కోసం కొత్త ఎత్తులు వేస్తేంది జగన్ రెడ్డి సర్కార్. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టేస్తోంది. అందులో భాగంగానే విశాఖ పట్నంలోని పలు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులకు తనఖా పెట్టి అప్పులు తీసుకుంది.
విశాఖలోని ప్రభుత్వ భూములను తనఖా పెట్టడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వ తీరుపై విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వ ఆస్తులను తనఖా పెట్టడాన్ని నిరసిస్తూ విశాఖలో బీజేపీ ఆందోళన చేసింది. విశాఖ నాట్ ఫర్ సేల్ అంటూ కమలనాధులు ర్యాలీ తీశారు. ప్రభుత్వ భవనాలు తనఖా పెట్టడాన్ని నిరసిస్తూ విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన మహాధర్నాలో ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు బీజేపీ నేతలు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టుకుని, అప్పులు ఇస్తున్న బ్యాంకులపైన కూడా సీబీఐ ఎంక్వైరీ చేయాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు
ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు ఇవ్వడం దారుణమని మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. రెండో దశలో కలెక్టర్‌తో పాటు, మిగిలిన 11 ఆస్తులు కూడా పెట్టేస్తారన్నారు. మూడో దశలో కేజీహెచ్, విమ్స్, ఘోష ఆసుపత్రి ఆర్కే బీచ్ కైలాసగిరి కూడా పెట్టేస్తా రేమో అని ఆయన ఎద్దేవా చేశారు. మీ భారతి సిమెంటు, ఇడుపులపాయ ఎస్టేట్, బెంగళూరులో భారీ భవనం లోటస్ పాండ్ పెట్టొచ్చు కదా విష్ణుకుమార్ రాజు కామెంట్ చేశారు. ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టడం, రాజ్యాంగ విరుద్ధమని ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ప్రభుత్వ నిర్ణయంపై న్యాయపోరాటంచేస్తామని చెప్పారు. విశాఖపట్నం నాట్ ఫర్ సేల్ అన్న విషయాన్ని జగన్ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలన్నారు మాధవ్.