కేసీఆర్ చెప్పిన వారికే పీసీసీ అధ్యక్ష పదవి?
posted on Feb 18, 2021 @ 12:11PM
కేసీఆర్ డైరెక్షన్ లోనే కాంగ్రెస్ పని చేస్తోందా? సీఎం చెప్పినట్టే హస్తం నేతలు యాక్షన్ చేస్తున్నారా? ఇది ఎప్పటి నుంచో వినిపిస్తున్న విమర్శ. కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోవర్టులు ఉన్నారని ఆ పార్టీ నేతలు కొందరు గతంలో ఆరోపించారు. పార్టీ అంతర్గత సమావేశాల్లో జరిగే చర్చల అంశాన్ని ఎప్పటికప్పుడు కేసీఆర్ కు చేరవేస్తుంటారని అంటుంటారు. గతంలో రైతులకు ఉచిత ఎరువుల ప్రకటన సమయంలోనూ ఇలానే జరిగింది. అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన అని.. దాన్ని కేసీఆర్ కు లీకులు ఇచ్చారంటూ స్వయంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డే ఆరోపించడం గతంలో సంచలనంగా మారింది. తాజాగా.. కేసీఆర్ కనుసన్నల్లోనే కాంగ్రెస్ పని చేస్తుందంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన కామెంట్లు చేశారు. సీఎం కేసీఆర్ చెప్పిన వారికే పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని అన్నారు. ఎంపీ చేసిన ఈ కామెంట్లు ఇప్పుడు కాంగ్రెస్ లో కల్లోలం రేపుతున్నాయి. ఇందులో నిజముండే అవకాశమూ లేకపోలేదని అంటున్నాయి. పీసీసీ చీఫ్ పదవి కోసం హస్తం పార్టీలో వారాల తరబడి మంత్రాంగం నడుస్తోంది. ఆశావహులంతా హస్తిన వెళ్లి పెద్దలను కలుస్తున్నారు. రేసులో రేవంత్ రెడ్డి అందరి కన్నా ముందుండగా... సీనియర్లంతా కలిసి ఆయన అభ్యర్థిత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రేవంత్ కు పగ్గాలు అప్పగితే.. తామంతా పార్టీ వదిలి వెళ్లిపోతామంటూ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒక్కడు ఒకవైపు.. సీనియర్లు మరోవైపు చేరి... పీసీసీ అధ్యక్ష పదవి కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు.
పార్టీ నేతల తీరు చూసి కాంగ్రెస్ అధిష్టానం సైతం ఎటూ తేల్చుకోలేని దుస్థితి. రాహుల్ గాంధీ ఆశీస్సులతో రేవంత్ రెడ్డి వైపే హైకమాండ్ మొగ్గు చూపుతున్నా.. ఆయన్ను పీసీసీ చీఫ్ చేస్తే సీనియర్ల నుంచి ఎలాంటి తలనొప్పులు వస్తాయోనని భయపడుతోంది. అందుకే, కేండిడేట్ ఫైనల్ అయినా కూడా ఇంకా డెసిషన్ పెండింగ్ లోనే ఉంచింది. ఈ లోపు కోమటిరెడ్డి, జగ్గారెడ్డి, చిన్నారెడ్డి, వీహెచ్ లాంటి నేతలంతా తమ వంతుగా పీసీసీ సీటు కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే.. అంతా అనుకున్నట్టు కాదని, కేసీఆర్ కు కాంగ్రెస్ కు చీకటి ఒప్పందం ఉందనేది బీజేపీ నేతల ఆరోపణ. తెలంగాణలో కమల దండయాత్రను అడ్డుకోడానికి ఆ రెండు పార్టీలు ఒప్పందం చేసుకున్నాయని చెబుతున్నారు. అందుకే, కేసీఆర్ సూచించిన వారికే పీసీసీ చీఫ్ పదవి వస్తుందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారని అంటున్నారు.