కమల దళానికి చీలిక ఓట్లే శ్రీరామ రక్ష!
posted on Nov 29, 2022 @ 9:03PM
గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల ప్రచారం (మంగళవారం, నవంబర్ 29) ముగిసింది. డిసెంబర్ 1 వ తేదీన, ఫస్ట్ ఫేజ్ లో పోలింగ్ జరిగే, 89 నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారం మంగళవారం చివరి రోజున, కేంద్ర మంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్, బీజేపే అధ్యక్షుడు జేపీ నడ్డ సహా పలువురు బీజేపే సీనియర్ నాయకులు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గ్గే సహా పలువురు సీనియర్ నాయకులు రోడ్ షో లో పాల్గొన్నారు. మొదటిసారిగా ముక్కోణపు పోటీ జరుగతున్న నేపధ్యంలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
గుజరాత్ ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత షా, బీజేపీఅగ్రనేత ఎల్కే అద్వానీల స్వరాష్ట్రమే కాకుండా, బీజేపీ మార్క్ రాజకీయాలకు, డెవలప్మెంట్ నమూనాకు, రోల్ మోడల్ గా నిలిచిన రాష్ట్రం. అలాగే, జాతీయ స్థాయిలో బీజేపీ ఎదుగుదలకు, ఉత్తర ప్రదేశ్ (రామ జన్మ భూమి) తొలి కేంద్ర బిందువు అయితే, కమలదళం కలను సాకారం చేసిన రాష్ట్రం గుజరాత్. నరేంద్ర మోడీ నాయకత్వంలోగుజరాత్ మోడల్ నినాదంతోనే, 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని విజయం సాధించింది. మాడు పదుల చరిత్రను తిరగ రాసింది. మూడు దశాబ్దాలలో తిలిసారిగా. లోక్ సభ బీజేపీ, మిత్ర పక్షాలతో కలిసి ఎన్డీఎ కూటమిగా పోటీ చేసినా, సొంతగానే సంపూర్ణ మెజారిటీ సాధించింది. ఈ అన్నిటినీ మించి, 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ‘హట్రిక్’ కు రేపటి గుజరాత్ ఎన్నికల ఫలితాలు కీలకం కానున్నాయి.
అలాగే, మొదటి సారిగా గుజరాత్ లో త్రిముఖ పోటీ జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటుగా, ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) కూడా సీరియస్ ఎన్నికల బరిలో నిలిచింది.అయితే ఇటు పాతికేళ్ళకు పైగా, రాష్ట్ర్రంలో అధికారంలో ఉన్న కమల దళాన్ని, ఇన్నేళ్ళుగా ప్రతిపక్షలో ఉన్నా, గత ( 2017) అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం పైగా (41.44) ఓట్లు, 77 సీట్లతో బలమైన ప్రతిపక్షంగా నిలించిన హస్తం పార్టీని తట్టుకుని ఆప్’ ఏ మేరకు ప్రభావం చూపుతుంది అనేది చూడవలసి ఉందని పరిశీలకులు అంటున్నారు. ఇంతవరకు ఆప్ చేస్తున్న విస్తరణ ప్రయత్నాలు ఒక్కపంజాబ్ లో తప్ప ఇంకెక్కడా ఫలించలేదు. ఈ నేపధ్యంలో డిసెంబర్ 8 ఎనిమిదిన ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వతగానీ, గుజరాత్లో చీపురు (ఆప్ చిహ్నం) బలమేమిటో తేలదు. కానీ, ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన ‘పంజాబ్’ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, ఊపు మీదున్న ఆప్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రధాన ప్రత్యర్ధి పార్టీలు,బీజేపీ, కాంగ్రెస్;కు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, అధికారంలోకి రావడం ఖాయం అన్న విశ్వాసంతో ముందుకు సాగుతోంది.
ఆప్ జాతీయ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చాలా ముందునుంచే గుజరాత్ పోల్స్ పై ఫోకస్ పెట్టి, పెద్ద ఎత్తున ప్రచారం సాగించారు. మోడీ గుజరాత్ మోడల్ పేరున దేశంలో కాషాయ జెండా ఎగరేస్తే, కేజ్రీవాల్ ఢిల్లీ మోడల్ పేరున గుజరాత్ లో తమ జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తున్నారు. ఉచిత విద్యుత్, మహిళకు నెలకు వెయ్యి రూపాయల పెన్షన్, మెరుగైన ఉచిత విద్య, వైద్య సదుపాయాల వంటి ఉచిత హామీలతో గుజరాతీలను ఆకట్టుకునే గట్టి ప్రయత్నమే కేజ్రీవాల్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఉచిత వరాల మీదనే దృష్టి కేంద్రీకరించింది.అయితే, 2017 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ మరింత బలహీన పడిందని పరిశీలకులు భావిస్తున్నారు.
పటేల్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ సహా ఇంచుమించుగా ఓ డజను మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.బీజేపీ,ఆప్ పార్టీలతో పోలిస్తే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలోనూ కొంత వెనక బడింది. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల గాంధీ మొక్కుబడిగా రెండు మూడు రోజులు ప్రచారంలో పాల్గొన్నారే తప్ప.పెద్దగా మనసు పెట్టి ప్రచారం సాగించలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరుగతున్న తొలి ఎన్నికల్లో, హుషారుగా ప్రచారంలో పాల్గొన్నారు.కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక వాద్రా, ఇతర ముఖ్యనేతలు కొంతవరకు ప్రచారంలో పాల్గొన్నా,మోడీ, షాల ప్రచార హోరుతో పోటీ పడలేక పోయారనే, పరిశీలకులు బావిస్తున్నారు.
మరోవంక ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా,బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర బీజేపీ సీనియర్ నాయకులు ఎన్నికల ప్రకటకు ముందు నుంచే సుడిగాలి పర్యటనతో రాష్ట్రాన్ని చుట్టేశారు. అదలా ఉంటే, ప్రధాని నరేంద్ర మోడీని రావణాసురుడితో పోలుస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు గుజరాత్ ఎన్నికల ప్రచారాన్ని మరింతగా వేడెక్కించాయి. ఆయన వ్యాఖ్యలను కమలనాథులు తప్పుబట్టారు. గుజరాత్ పుత్రుడిని కాంగ్రెస్ అవమానిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు.
గుజరాత్ ఎన్నికల వేడిని తట్టుకోలేకనే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే మాట తూలారని, ప్రధానమంత్రిని రావణునితో పోల్చారని అమిత్ మాలవీయ ట్వీట్‌లో ఖండించారు. ఖర్గే మాట్లాడిన వీడియోను కూడా షేర్ చేశారు. మౌత్ కా సౌదాగర్ నుంచి 'రావణ్' వరకూ కాంగ్రెస్ అనేక సార్లు విమర్శలు చేస్తూ గుజరాత్‌ను, గుజరాత్ పుత్రుడిని పదేపదే అవమానిస్తోందని అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 1,5 తేదీల్లో జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడుతాయి.
అయితే, గుజరాత్ లో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని, ప్రీ పోల్ సర్వేలు చెపుతున్న జోస్యాలను రాజకీయ పరిశీలకులు కూడా సమర్ధిస్తున్నారు. ఓ పక్క నుంచి ఆప్ మరో వైపు నుంచి 13 ముస్లింల ఆధిపత్యం ఉన్న 13 కీలక స్థానల్లో ఎంఐఎం కాంగ్రెస్ పార్టీ ఓటుకు గండికోడతాయని, ఫలితంగా గత ఎన్నికల్లో గెలిచిన 99 స్థానాలు అదనంగా మరో 20 నుంచి 25 స్థానల్లో విజయం సాధించి, బీజేపీ మరో సారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంటున్నారు.
ఈ ఎన్నికల కోసం 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. గుజరాత్ అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. వీటిలో 142 జనరల్ కాగా..17 ఎస్సీ, 23 ఎస్టీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న 1621 మంది అభ్యర్థుల్లో 330 మందిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. క్రిమినల్ కేసులు ఉన్న వాళ్లలో 61 మంది అభ్యర్థులతో ఆప్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. కాంగ్రెస్ నుంచి 60 మంది, బీజేపీ నుంచి 32 మంది క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులు పోటీలో ఉన్నారు.