అవినీతి కేసుల్లో జగన్ ప్రపంచ రికార్డ్!
posted on Apr 9, 2021 @ 7:50PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను హీటెక్కిస్తోంది. ఎన్నికల ప్రచారంలో నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గురువారం నుంచి ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు... వైసీపీ సర్కార్ ను కడిగిపారేస్తున్నారు. బీజేపీ నేతలు కూడా సీఎం జగన్ టార్గెట్ గా వాయిస్ పెంచారు. బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ రెండు వందల కోట్లు పంచేందుకు సిద్ధంగా ఉందని ఆయన ఆరోపించారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు మాతమ దగ్గర ఉన్నాయని.. అవసరమైనప్పుడు బయటపెడుతామని చెప్పారు. ఉపఎన్నికలో వైసీపీ ధనప్రవాహన్ని అడ్డుకుంటాం అని సత్యకుమార్ స్పష్టం చేసారు. దేశంలో అవినీతి కేసుల్లో జగన్ రెడ్డిది ప్రపంచ రికార్డ్ అని అన్నారు. మరో ఆరు నెలల్లో జగన్ బెయిల్ రద్దు అవుతుందన్న ప్రజల భావనే మా మాట అని సత్య కుమార్ అన్నారు.
రమణ దీక్షితులు తాడేపల్లిలో ముఖ్యమంత్రి దగ్గర అర్చకత్వం చేసుకోవడం ఉత్తమం అని సత్య కుమార్ ఎద్దేవా చేసారు. విదేశీ మతాచారాన్ని అనుసరిస్తున్న సీఎంని విష్ణుమూర్తితో పోల్చడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేసారు. రమణ దీక్షితుల మాటలు బ్రాహ్మణ సమాజానికి అవమానకరం అని ఆరోపించారు. బీజేపీ, పవన్ కళ్యాణ్ కలయిక చూస్తే జగన్ కి వెన్నులో వణుకు పుడుతుందన్నారు సత్యకుమార్. పవన్ సినిమా ప్రీమియర్ షో, ఫ్యాషన్ షో అడ్డుకోవడం ఇందుకు నిదర్శనంఅన్నారు. ఇక12 న తిరుపతి పార్లమెంట్ లో బీజేపీ అగ్రనేతల ప్రచారం ఉంటుందని వెల్లడించారు. తిరుపతిలో నడ్డా రోడ్ షో అదే రోజు పవన్ కళ్యాణ్ తో కలిసి బహిరంగ సభ ఉంటుందని అన్నారు.
ఇక మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ కూడా మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ భయపడే తిరుపతి ఉప ఎన్నికల ప్రచారానికి వస్తున్నారు అని అన్నారు. మా ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది అని తెలిపారు. ఒకసారి మోడికి అవకాశం ఇవ్వాలని తిరుపతి ప్రజలు అనుకుంటున్నారు అని, వైసిపి కి, టిడిపి కి ఓటు వేసిన ఉపయోగంలేదని ప్రజలు భావిస్తున్నారని ఆయన ఆరోపించారు. బీజేపీ కి ఓటేస్తే మా ఎంపీ ప్రజలకు అండగా ఉంటారు అని వెల్లడించారు. తిరుపతి ప్రజలు బీజేపీకే ఓటు వేయాలనుకుంటున్నారు అని అన్నారు.