తాలిబన్లతో ఓవైసీ చర్చలు!.. బీజేపీ నేత సంచలనం..
posted on Aug 19, 2021 @ 12:09PM
తాలిబన్. అఫ్ఘనిస్తాన్. కొన్ని రోజులుగా ప్రపంచమంతా ఇదే ఇష్యూ. అంతటా తాలిబన్ల గురించే చర్చలు. వారి క్రూరత్వం, హింసపై భయాందోళనలు. దేశం విడిచి వెళ్లిపోయేందుకు విమానం ఎక్కేందుకు పోటీపడుతున్న అఫ్ఘన్‌ల దృశ్యాలు. తుపాకులతో కాబూల్ వీధుల్లో తాలిబన్ల అరాచకాలు. అఫ్ఘనిస్తాన్‌లో చిక్కుకుపోయిన భారతీయులను అతికష్టం మీద స్వదేశానికి రప్పిస్తోంది ఇండియా. ఇలాంటి సందర్భంలో.. ఎమ్ఐఎమ్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
తాలిబన్లను ఇండియా గుర్తించినా గుర్తించకపోయినా వారితో చర్చలకు లాంఛనంగా మార్గాలను తెరిచి ఉంచాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఇటీవల వ్యాఖ్యానించారు. దేశ వ్యూహాత్మక ప్రయోజనాల పరిరక్షణకు తాలిబన్లతో దౌత్యపరమైన మార్గాలను తెరిచి ఉంచాలని 2013లోనే తాను ఈ సలహా ఇచ్చానని, అయితే తన సలహాను ఖాతరు చేయకపోగా విమర్శించారని ఒవైసీ అన్నారు. అఫ్గనిస్తాన్‌లో భారత్ 3 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టిందని, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటూ ప్రశ్నించారు ఓవైసీ.
అఫ్గానిస్తాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లతో భారత ప్రభుత్వం చర్చలు జరపాలంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ చేసిన వ్యాఖ్యలపై తాజాగా బీజేపీ నాయకురాలు విజయశాంతి కౌంటర్ ఇచ్చారు. అసదుద్దీన్.. కేంద్రానికి ఉచిత సలహా ఇచ్చే బదులు కాబూల్ వెళ్లి ఆ పని ఆయనే చేస్తే బాగుంటుందంటూ సెటైర్ వేశారు.
‘భారత్‌లోని ఆఫ్ఘన్ రాయబారి స్వయంగా తాలిబన్లను వ్యతిరేకిస్తూ, ఆ దేశంలో ఇంకా పోరాడుతున్న ఆఫ్ఘనిస్థాన్ ఉపాధ్యక్షుడిని సమర్థించినప్పుడు, తాలిబన్లలతో భారత్ చర్చలు జరపాలని చెప్పడంలో అంతరార్థమేమిటో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకే తెలియాలి. అంతకన్నా ఒవైసీ జీ స్వయంగా కాబూల్ వెళ్ళి తాలిబన్లలతో చర్చలు జరిపి వచ్చి, సమాచారం అందిస్తే, ప్రస్తుత పరిస్థితుల్లో కొంత సమంజసంగా ఉంటుందేమో ప్రయత్నిస్తే మంచిది’ అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు. ఓవైసీపై బీజేపీ నేత, మాజీ ఎంపీ విజయశాంతి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.