ఆత్మరక్షణలో కమల దళం!
posted on Apr 4, 2023 @ 3:19PM
భారతీయ జనత పార్టీ ( బీజేపీ) ఆత్మరక్షణ పడిందా? ఓ పక్క నుంచి అదానీ వ్యవహారం, మరో వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్హతల వివాదం అలాగే, ప్రతిపక్ష పార్టీలను ఏకం చేస్తున్న కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనర్హత వివాదం.. ఇలా ఒక్క సారిగా ముప్పేట దాడి ముంచుకొస్తున్న సమయంలో బీజేపీ ఆత్మ రక్షణలో పడిందా? అందుకే, యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగినట్లు చెపుతున్న అవినీతి ఆరోపణలను మళ్ళీ మరో మారు తెర మీదకు తెస్తోందా అంటే రాజకీయ పరిశీలకులు అవుననే అంటన్నారు. ఈ నేపధ్యంలోనే ‘కాంగ్రెస్ ఫైల్స్’ పేరిట పాత కథలను ఫ్రెష్ గా తెరపైకి ఎక్కిస్తోందని అంటున్నారు.
నిజానికి, 2014కు ముందు పదేళ్ళ పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ (యూపీఏ) ప్రభుత్వం ఎదుర్కోని అవినీతి ఆరోపణ ఏదీ లేదు. కింద భూమి పైన ఆకాశం హద్దుగా ఇటు బొగ్గు నుంచి అటు స్పెక్ట్రమ్ వరకు అన్ని వ్యవహారాలలో అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి. విచారణలు జరిగాయి. ఆరోపణలలో నిజానిజాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ఆరోపణల కారణంగానే 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. భారీ మూల్యాన్ని చెల్లించింది. బీజేపీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వపై వచ్చిన అవినీతి ఆరోపణలను ప్రధాన అస్త్రాలుగా చేసుకుని అధికారంలోకి వచ్చింది. అయితే ఆ తర్వాత ఆ కేసులు విచారణలు ఏమయ్యాయో ఎటు పోయాయో ఎవరికీ తెలియదు. కానీ, ఇప్పడు బీజేపీ దాచేస్తే దాగని సత్యాలంటూ పాత అవినీతి కథలను కాంగ్రెస్ ఫైల్స్ పేరిట వరస వీడియోలను విడుదల చేస్తోంది.
అందులో భాగంగా తాజాగా కాంగ్రెస్ ఫైల్స్ మూడో ఎపిసోడ్‌ను బీజేపీ ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. అందులో 2012లో జరిగిన బొగ్గు కుంభకోణం గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ కాంగ్రెస్ పార్టీ అవినీతి మరకలను మళ్ళీ మరోమారు గుర్తు చేసింది. మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఆయన అనేక హామీలు కురిపించారు.
కానీ కాంగ్రెస్ కుంభకోణాలే అప్పుడు హెడ్లైన్లలో వచ్చాయి. అందులో ప్రధానమైనది బొగ్గు కుంభకోణం. దీని కారణంగా మన దేశం రూ.1.86లక్షల కోట్ల నష్టాన్ని చవిచూసింది. 2004-2009 మధ్య ఈ కుంభకోణం చోటుచేసుకుంది ఆ సయమంలో బొగ్గు మంత్రిత్వ శాఖ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, శిబు సోరెన్ చేతుల్లో ఉంది. కాంగ్రెస్ రిమోట్ కంట్రోల్ ఆదేశాలతో ఈ ప్రధాని పనిచేశారు అని బీజేపీ తాజా ఎపిసోడ్ లో వివరించింది.
అదానీ స్టాక్ మార్కెట్ కుంభకోణం వెలుగు చూసినప్పటి నుంచి, ప్రతిపక్ష పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మరీ ముఖ్యంగా ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ అదానీ, మోడీ సంబంధాలను ప్రశ్నిస్తున్న నేపధ్యంలో బీజేపీ అందుకు కౌంటర్ గా గత మూడు రోజులుగా, కాంగ్రెస్ అవినీతి పై రోజుకో వీడియోను విడుదల చేస్తోంది. మొదటి ఎపిసోడ్‌ను ట్రైలర్ అని పేర్కొన్న బీజేపీ, కాంగ్రెస్ పాలనలో రూ.4.82 లక్షల కోట్ల మేర అవినీతి జరిగిందని ఆరోపించింది. అలాగే సెకండ్ ఎపిసోడ్ లో ఎంఎఫ్ హుస్సేస్ పెయింటింగ్స్ వివాదాన్ని ప్రస్తావించింది. ప్రియాంక గాంధీ నుంచి ఎంఎఫ్ హుస్సేన్ పేయింటింగ్‌ను రూ.2కోట్లకు కొనుగోలు చేయాలని కాంగ్రెస్ తనను బలవంతపెట్టిందని యస్‌బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్ ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ను ఆ వీడియోలో చూపించింది. అందుకు బదులుగా పద్మభూషణ్ ఇప్పిస్తామని హస్తం పార్టీ తనకు హామీ ఇచ్చినట్లు రాణా కపూర్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
ఇప్పుడు తాజగా మనోమోహన్ సింగ్ మిస్టర్ క్లీన్ ఇమేజ్ కి మచ్చ తెచ్చిన బొగ్గు కుంభకోణం కేసును తెరకేక్కించింది. అదానీ గ్రూప్ కంపెనీల వ్యవహారం, రాహుల్ అనర్హత వంటి అంశాలపై విపక్షాలు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న తరుణంలో బీజేపీ ఈ వీడియోలు విడుదల చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే 2014కు ముందు ప్రతిపక్షంలో బీజేపీ ఆరోపణలు చేస్తే ప్రజలు విశ్వశించారు. కానీ ఎనిమిదేళ్ళకు పైగా అధికారంలో ఉండి ఎమీ చేయని బీజేపీ ఇప్పడు పాత ఫైల్స్ కు దుమ్ము దులిపి, కాంగ్రెస్ ఫైల్స్ అంటూ కాంగ్రెస్ పార్టీ పై బురద చల్లితే ప్రజలు నమ్ముతారా? నవ్వుకుంటారా?